వస్తువులను సరఫరా చేసే కొరియర్ సంస్థలకు ఎదురుదెబ్బ తగలనుంది. ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా నగర ప్రాంతాల్లో 50 శాతానికి పైగా తమ ఆర్డర్లను తామే సరఫరా చేసుకోవటానికి అమెజాన్ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. అమెజాన్ సొంత సరఫరా సంస్థ అయిన 'అమెజాన్ లాజిస్టిక్స్' త్వరలోనే యూపీఎస్, ఫెడెక్స్ లాంటి దిగ్గజాలను అధిగమిస్తుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
జెఫ్ బెజోస్ సారథ్యంలో నడుస్తున్న అమెజాన్.. గ్రామీణ ప్రాంతాలకు తమ వస్తువులను చేరవేయటానికి ఇప్పటి వరకు ఇతర కొరియర్ సంస్థల మీదే ఆధారపడుతోంది. ప్రస్తుతం అమెరికాలో 2.5 బిలియన్ డెలివరీలను అమెజాన్ సరఫరా చేస్తుండగా, ఫెడెక్స్ మూడు బిలియన్లు, యూపీఎస్ 4.7 బిలియన్లను సరఫరా చేస్తోంది. 2022 కల్లా అమెజాన్ డెలివరీలు 6.5 బిలియన్లను చేరుకోనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.