గత ఆర్థిక సంవత్సరం (2019-20) టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా రికార్డు స్థాయి నష్టాలను మూటగట్టుకుంది. 2019-20లో సంస్థ మొత్తం నష్టాలు రూ.73,878 కోట్లుగా ప్రకటించింది. భారతీయ కంపెనీల్లో ఇది వరకు ఏ కంపెనీ ఈ స్థాయి నష్టాలను నమోదు చేయలేదు.
2018-19 ఆర్థిక సంవత్సరంలోనూ ఈ సంస్థ రూ.14,603.9 కోట్లు నష్టాన్ని ప్రకటించింది.
టెలికామేతర ఆదాయాన్నీ.. చట్టబద్ధమైన చెల్లింపుల్లో చేర్చాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. సంస్థ రూ.51,400 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కంపెనీలపై మరింత భారాన్ని పెంచినట్లు వొడాఫోన్-ఐడియా పేర్కొంది.
భారీ నష్టాలు..
2019-20 చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో వొడాఫోన్-ఐడియా నికర నష్టం రూ.11,643.5 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నికర నష్టం రూ.4,881.9 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ రూ.6,438.8 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది.