హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. లిస్టింగ్ నెగెటివ్‌గా ఉండొచ్చన్న అంచనాలను తారుమారు చేస్తూ.. లాభాలతో ముందుకు సాగుతోంది.
బీఎస్ఈలో విజయ షేరు రూ.542.30 వద్ద లిస్టయింది. ఇష్యూ ధర రూ.531తో పోలిస్తే.. ఇది 2.12 శాతం అధికం. ప్రస్తుతం షేరు విలువ 12.09 శాతం లాభంతో రూ.595.20 వద్ద ట్రేడవుతోంది.
ఎన్ఎస్ఈలో ప్రీమియంతో పోలిస్తే.. 1.69 శాతం లాభంతో రూ.540 ధర వద్ద లిస్టయింది. ప్రస్తుతం 10.26 శాతం వృద్ధితో రూ.595.40 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
ఐపీఓ ఇలా..
రూ.1,895.14 కోట్లు సమీకరించే లక్యంతో ఈ నెల 1న ఐపీఓకు వచ్చింది విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ఐపీఓలో షేరు ధరను రూ.522-531గా నిర్ణయించింది
విజయ డయాగ్నోస్టిక్ గురించి..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దిల్లీ సహా 13 ప్రాంతాల్లో 80 కేంద్రాల ద్వారా ఈ సంస్థ డయాగ్నోసిస్ సేవలు అందిస్తోంది. ఐపీఓ ద్వారా ప్రమోటర్ డాక్టర్ ఎస్.సురేంద్రనాథ్ రెడ్డి, ఇన్వెస్టర్లు కారాకోరమ్ లిమిటెడ్, కేదారా క్యాపిటల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లు..3.56 కోట్ల షేర్లను విక్రయించారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.84.91 కోట్ల లాభాన్ని ప్రకటించింది ఈ సంస్థ. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.62.5 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో ఆదాయం రూ.354.18 కోట్ల నుంచి రూ.388.59 కోట్లకు పెరిగింది.
ఇదీ చదవండి: 'స్క్రీన్ చూడకుండా నిజ జీవితంలో ఉండాలనుకుంటున్నాను'