తెలంగాణ

telangana

ETV Bharat / business

భవిష్యత్తు ఇంకెంత 'స్మార్ట్​'గా ఉండనుందో..! - సరికొత్త సాంకేతికతల వార్తలు

ఇరవై ఏళ్ల క్రితం.. అసలు స్మార్ట్‌ఫోన్‌ అన్న మాటే మన డిక్షనరిలో లేదు. ఇప్పుడది లేకపోతే రోజు గడవదు. ఉన్నవాళ్లు ఖరీదైన హై-ఎండ్‌ ఫోన్లు వాడితే బడ్జెట్‌ పద్మనాభాలు తక్కువ ధర ఫోన్లు వాడతారు. ఎవరు వాడినా అది స్మార్ట్‌ ఫోనే! అత్యంత ఆధునిక టెక్నాలజీని అందరి చేతుల్లోకి తెచ్చిన ఏకైక గ్యాడ్జెట్‌! ఏయేటికాయేడు కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తూ వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ కొత్త దశాబ్దిలో ఇంకెంత స్మార్ట్‌గా మారనుందోనన్న ఊహలకు తెరలేపింది కొత్త సంవత్సరం. ఆ ఊహలకి బలాన్నిస్తున్నాయి పలుచోట్ల జరుగుతున్న అధ్యయనాలు.

new technology
మరింత స్మార్ట్​గా టక్నాలజీ

By

Published : Jan 5, 2020, 10:37 AM IST

మొట్టమొదటి సారి సెల్‌ఫోన్‌ కొనుక్కున్న రోజు మీకు గుర్తుందా! ఫోను చేయగానే అవతలివాళ్లు ‘హలో... ఎవరూ...’ అనకుండా ‘చెప్పమ్మా..’ అని పేరు పెట్టి పిలిచినప్పుడు అంత దూరాన ఉన్న మనిషీ భుజాన చెయ్యేసి ఆప్యాయంగా పలకరించినట్లు అనిపించలేదూ..! ఇంట్లోవారికీ బయటివారికీ రకరకాల రింగుటోన్లూ కాలర్‌ఐడీలూ మార్చుకుంటూ, పాటలు వింటూ, ఎస్సెమ్మెస్‌లు పంపుకుంటూ.. ఎంత ఆనందించేవాళ్లమో కదూ! మెల్లగా ఆ ఫోనులోకి కెమెరా వచ్చింది. కళ్లకి నచ్చిన దృశ్యాలన్నీ క్లిక్కులై గ్యాలరీలో కొలువుతీరుతున్నాయి. ఇంటర్నెట్‌ వచ్చింది. షాపింగూ బ్యాంకింగూ టికెట్‌ బుకింగూ.. క్షణాల్లో అయిపోతున్నాయి.

పాటలు విన్నా సినిమాలు చూసినా అందులోనే! టచ్‌స్క్రీన్‌, ఫింగర్‌ప్రింట్‌, త్రీడీ ఫేషియల్‌ రికగ్నిషన్‌, వాయిస్‌ కమాండ్స్‌... ఎన్నెన్నో హంగులు దానికి! అసలీ స్మార్ట్‌ఫోన్‌ అన్న కాన్సెప్ట్‌ 1990ల్లోనే వచ్చినా సామాన్యులకు అందుబాటులోకి రావడానికి కాస్త టైమ్‌ పట్టింది. పుష్కరం క్రితం ఐఫోన్‌ విడుదలయ్యాకే స్మార్ట్‌ ఫోన్‌ అన్న మాట అందరినోళ్లలోనూ నానడం మొదలెట్టింది. ఇక ఆ తర్వాత ఏయేటికాయేడు కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తూ విస్తరించిన స్మార్ట్‌ఫోన్‌ సంఖ్యలో ఇప్పుడు ప్రపంచ జనాభాని మించిపోయింది. ఇంతలా మన జీవితాలతో పెనవేసుకున్న ఫోను రేపు ఎలా ఉండబోతోందీ అన్నది ఆసక్తికరమైన విషయమే. ఇప్పుడు ఫోను చేస్తున్న పనులను పదిహేనేళ్ల క్రితం మనం కనీసం ఊహించ లేదు. అలాగే మరో పదేళ్లకి ఈ ఫోను ఇంకేం చేస్తుందన్నదీ ఇప్పుడు మన ఊహకి అందకపోవచ్చు. కానీ సాంకేతిక నిపుణులు ఊహించగలరు. ఎందుకంటే... ఒక ఊహ వాస్తవరూపం సంతరించుకోవటానికి ఎంతకాలం పడుతుందో, దాని వెనక ఎంత కృషి జరుగుతుందో వాళ్లకి తెలుసు.

రూపమే మారిపోవచ్చు!

ఇప్పటివరకు చేతిలో నిండుగా ఉంటూ పర్సు లేకపోయినా పర్వాలేదు, ఫోను ఉందిగా అన్న భరోసానిస్తూ వచ్చిన ఈ ఫోన్‌ ఇంకొన్నాళ్లయితే అసలు కన్పించకపోవచ్చు. అయ్యో... ఫోను లేకుండా ఎలా అని కంగారుపడకండి. ఫోను ఉంటుంది కాకపోతే రూపమే మారిపోతుంది. రాబోయే కొత్త తరం ఫోన్లు విడిగా ఓ పరికరంలా కాకుండా మనలో ఒక భాగంగా మారిపోవచ్చు. ముంజేతి కంకణంగానో, వేలి ఉంగరంగానో, కళ్లద్దాలుగానో అమరిపోవచ్చు. మనం రోజువారీ చేసే ఎన్నో పనులకు అవి రిమోట్‌లా పనిచేయవచ్చంటున్నారు నిపుణులు. ఫోను రూపంలోనూ పనితీరులోనూ వచ్చే దశాబ్దం గొప్ప మార్పుల్ని తీసుకురానుందనీ ఇప్పటివరకూ జరుగుతున్న పరిశోధనలే అందుకు నిదర్శనమనీ అంటున్నారు వారు. ఉదాహరణకు మడత పెట్టగల ఫోన్‌ గత ఏడాది సంచలనం సృష్టించింది. నిజానికి కేంబ్రిడ్జిలోని తమ రీసెర్చ్‌ సెంటర్‌ లేబొరేటరీ డైరెక్టర్‌ తపానీ టైహనెన్‌ తయారుచేసిన ‘ద మార్ఫ్‌’ కాన్సెప్ట్‌ ఫోను డిజైన్‌ని నోకియా 2008లోనే ప్రదర్శించింది. అన్ని కంపెనీలూ దాన్ని అందిపుచ్చుకుని ప్రయోగదశలన్నీ దాటి మార్కెట్లోకి తీసుకురావడానికి పదేళ్లు పట్టింది. అలా ఇంకా ఎన్నో విషయాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ ఈ ఏడాది కాకపోతే మరో రెండేళ్లకైనా మన ముందుకు వస్తాయని గ్యాడ్జెట్‌ నిపుణుల అంచనా.

రూపమే మారిపోవచ్చు!

నాలుగు మిల్లీ సెకన్లు

త్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న 5జీ సౌకర్యంతో స్మార్ట్‌ఫోను పనితీరు చాలా మారిపోతుంది. ఇంటర్నెట్‌ వేగం పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా బ్యాటరీ లైఫ్‌ పెరుగుతుంది. ఫోను ఎంత వేగంగా పనిచేస్తుందంటే- ఇప్పుడు మనం ఏదన్నా కమాండ్‌ ఇవ్వగానే 30 నుంచి 60 మిల్లీ సెకన్లలో స్పందిస్తున్న ఫోను అప్పుడు కేవలం నాలుగు మిల్లీ సెకన్లలో స్పందిస్తుంది. అంత వేగాన్ని అందిపుచ్చుకోవాలంటే మొత్తంగా ఫోను రూపమే మారక తప్పదు మరి. సాఫ్ట్‌వేరూ హార్డ్‌వేరూ అంటే- ఫోను లోపలా బయటా కూడా మారాలి కాబట్టి స్మార్ట్‌ ఫోన్‌ ఇంకా ఎన్నో రెట్లు స్మార్ట్‌ అవుతుందనీ దానికి తగ్గట్టుగా రూపమూ మారుతుందనీ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

సిమ్‌ ఉండదు!

రాబోయే రోజుల్లో మనం వాడబోయే ఫోనుల్లో సిమ్‌ ఉండదట. దాని బదులుగా ఈ-సిమ్‌ ఉంటుందనీ దాన్ని ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చనీ అంటున్నారు నిపుణులు.

సిమ్‌ ఉండదు!

తయారీ:ఫోను వేడెక్కడం, బరువుగా ఉండడం, పగిలిపోవడం... ఈ సమస్యల పరిష్కారానికి ఎంఐటీ పరిశోధకులు చేసిన కృషి ఫలించింది. వాళ్లు తయారుచేసిన పాలిమర్‌ మెటీరియల్‌తో ఫోన్లు తయారుచేస్తే పైన చెప్పిన సమస్యలేవీ ఉండవు, పైగా ఫోన్లు చాలా చౌక అవుతాయి.

కెమెరా: 5- 8 మెగా పిక్సెల్స్‌తో మొదలైన ఫోన్‌ కెమెరాలు ఇప్పుడు పాతిక, ముప్పై దాటాయి. 48ఎంపీ కెమెరాలున్న ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉంటే రాబోయే కొత్త ఫోన్లు ఏకంగా వంద ఎంపీ దాటబోతున్నాయి. షియోమి, శాంసంగ్‌ కంపెనీలు 108 ఎంపీ కెమెరాలతో కొత్త ఫోన్లను తెస్తున్నాయి.

ఛార్జింగ్‌: ఎంత ఖరీదైన ఫోన్‌ అయినా దాని బ్యాటరీ మహా అంటే రెండు రోజులు వస్తుంది. ఆ తర్వాత ఛార్జింగ్‌ చేసుకోవాల్సిందే. అందుకు కాసేపు ఫోన్‌ పక్కన పెట్టాల్సిందే. ఆ అవసరం రాకుండా ఎనర్గస్‌ అనే కంపెనీ గాలి ద్వారా ఫోన్‌ దానంతటదే ఛార్జింగ్‌ అయ్యే సాంకేతికతను అభివృద్ధి చేసే పనిలో ఉంది. అది అందుబాటులోకి వస్తే ఇప్పుడు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ టవర్లలాగే ఛార్జింగ్‌ టవర్లు కూడా రావచ్చు. అప్పుడిక ఎక్కడికెళ్లినా ఫోన్‌ ఛార్జింగ్‌ అయిపోతుందన్న బాధ ఉండదు.

సాగే ఫోను: మడతపెట్టే ఫోన్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అలా కాకుండా చిన్నగా ఉండి కావాలనుకున్నప్పుడు కొద్దిగా సాగితే చాలు అనుకుంటున్నారా... అందుకూ ప్రయోగాలు జరుగుతున్నాయి. మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ ఇంజినీర్లు అలా సాగే సర్క్యూట్‌ని తయారుచేయగలిగారట. కాబట్టి ఈ పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లి సాగే ఫోనునీ తయారుచేయగలమని వారు నమ్మకంగా చెబుతున్నారు.

డ్రెస్‌కి మ్యాచింగ్‌: ఫోను రంగుని కూడా మన దుస్తులకి తగినట్లుగానో, మూడ్‌కి తగినట్లుగానో మార్చుకుంటే... అదీ వస్తుందట. పూర్తిగా పారదర్శకంగా ఉండే పగలని మెటీరియల్‌తో తయారైన ఫోన్లు వస్తాయి. మనం సెట్టింగ్స్‌లోకి వెళ్లి
కావాల్సిన రంగు ఎంచుకుంటే ఆ రంగులోకి ఫోను బ్యాక్‌ కవర్‌ మారిపోతుంది.

డ్రెస్‌కి మ్యాచింగ్‌

మనసెరిగి...:ఇప్పుడు స్పర్శతోనూ, మాటతోనూ ఫోనుతో పనిచేసుకుంటున్నాం. భవిష్యత్తులో మన ఆలోచననే పసిగట్టే ఫోను రావచ్చు. మనసులో మనం ఊరెళ్లడానికి టికెట్‌ బుక్‌ చేసుకోవాలి అనుకోగానే ఆ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అయిపోతుందన్న మాట. ఎవరికైనా ఏదైనా సందేశం పంపాలనుకుంటే దానంతటదే టైప్‌ అయి పంపనా అని అడుగుతుంది. దీనిపై ఫేస్‌బుక్‌ సంస్థలో పరిశోధనలు జరుగుతున్నాయి. నిమిషానికి వంద పదాలను టైప్‌ చేయగలగాలన్నది ఈ పరిశోధనల లక్ష్యం. ఎంఐటీలోని శాస్త్రవేత్తలు కూడా ‘ఆల్టర్‌ఈగో’ పేరుతో దాదాపు ఇలాంటి పరిశోధనే చేస్తున్నారు. కేవలం ఆలోచనలతోనే మెషీన్లతో సంభాషించడం. ఇది చదువుతుంటే నమ్మశక్యం కానట్టుగా ఉంది కానీ ఇప్పుడు మనం ఫోనుతో చేస్తున్న పనులన్నీ కూడా ఒకప్పుడు అలా అన్పించినవేనంటున్నారు పరిశోధకులు.

మనసు మెచ్చే పనులు చేసే స్మార్ట్​ఫోన్లు

కొత్త కొత్తగా...

కొన్ని కంపెనీలు ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న స్మార్ట్‌ ఫోన్‌ మోడల్స్‌కి ప్రచార వీడియోలను విడుదల చేసి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

  • శాంసంగ్‌ గెలాక్సీ జీరో మోడల్‌కి అసలు అంచు అనేది ఉండదు. ఫోను చివర్లు కూడా తెరలాగా కన్పించే దీన్ని ఇన్‌ఫినిటీ డిస్‌ప్లేగా పేర్కొంటోంది.
  • చాంగ్‌హాంగ్‌ హెచ్‌2 అనే చైనీస్‌ ఫోన్‌ ఏ పదార్థాన్నైనా స్కాన్‌ చేసి దాని లక్షణాలను చెప్పేస్తుంది. పండులో షుగర్‌ ఎంతుందనే కాదు, మన శరీరంలో కొవ్వు ఎంతుందో కూడా స్కాన్‌ చేసి చెప్పేస్తుందిది.
  • మార్కెట్లోకి ముందుగా రావడం కాదు, పర్ఫెక్ట్‌గా రావడం అనేది ఐఫోన్‌ సిద్ధాంతం. అందుకే వంక పెట్టడానికి లేనివిధంగా తయారుచేసిన మడత ఫోన్‌ ‘ఐఫోల్డ్‌’ని త్వరలోనే తెస్తుందని వేచిచూస్తున్నారు అభిమానులు.
  • ఇంగ్లిష్‌ కంపెనీ ఫ్లెక్స్‌ఎనేబుల్‌ ఆర్గానిక్‌ ఫ్లెక్సిబుల్‌ లిక్విడ్‌ స్క్రీన్‌ ఫోన్‌ కాన్సెప్ట్‌కి (ఓఎల్సీడీ) ప్రొటోటైప్‌ తయారుచేసింది. దీన్ని మడతపెట్టడమే కాదు, అవసరాన్ని బట్టి చేతి మణికట్టుకి, కారు స్టీరింగ్‌కి, కావాలంటే పెన్సిల్‌కి అయినా చుట్టేయొచ్చు.
  • ఇప్పటివరకూ మనం వేలి స్పర్శతో ఫోన్‌ని స్క్రోల్‌ చేస్తున్నాం. ఇకముందు కంటిచూపుతోనే ఆ పనిచేయొచ్చు. జడ్‌టీఈ హాక్‌ఐ మోడల్‌ ఫోనుని మనం ఒక్క చేత్తో పట్టుకుని చదువుకుంటున్నప్పుడు రెండో చేతి అవసరం లేకుండానే మన కంటి చూపును బట్టి తెర జరిగిపోతుంది.
  • తడిసినా పాడవని, కింద పడినా పగిలిపోని ఫోన్లు కావాలనుకునేవారి కోసం జపాన్‌ కంపెనీ ఫుజిత్సు ప్రత్యేకమైన ఫోన్లను తయారుచేస్తోంది. ఆ ఫోన్‌ సింక్‌లో పడినా సర్ఫ్‌నీళ్లతో కడుక్కుని వాడుకోవచ్చు. రోడ్డు మీద పడి ఏ బండో దాని మీదినుంచి వెళ్లిపోయినా తీసి దుమ్ము దులిపేసి జేబులో పెట్టుకోవచ్చు.
  • ఫోనుకి ముందూ వెనకా రెండు తెరలుంటే- ఎంచక్కా ఒకే ఫోనులో ఇద్దరూ వేర్వేరు సినిమాలు చూడొచ్చు కదా. వివోనెక్స్‌ డ్యూయల్‌ స్క్రీన్‌, యోటాఫోన్‌2 లాంటివి అలాగే ఉంటాయి. చూడటానికే కాదు, వీడియోలూ ఫొటోలూ తీసుకోడానికీ ఈ రెండు తెరలూ బాగా ఉపయోగపడతాయట.
    కొత్త కొత్తగా...

సూర్యరశ్మితో ఛార్జింగ్‌..!

చేతికి ఉన్న బ్రేస్‌లెట్‌ నుంచి పలుచని కాగితంలాంటి దాన్ని బయటకు తీసి ఫోనులా వాడుకుని మళ్లీ లోపలికి మడిచేసే రోల్‌ అవుట్‌ ఫోను నానోటెక్నాలజీతో పనిచేస్తుందట. దీంతో ఫొటోలు తీసుకోవచ్చు, వీడియోలూ చూడవచ్చు. ఛార్జింగ్‌ అయిపోతే ఫోనుని కాసేపు ఎండలో పెడితే చాలు, ఛార్జ్‌ అవుతుంది. డిజైనర్‌ అలెక్సాండర్‌ ముకొమెలొప్‌ దాదాపు పదేళ్లక్రితం ఊహించిన ఈ ఫోను ప్రస్తుతానికి ఫొటోల్లోనూ వీడియోల్లోనూ కన్పిస్తోంది. మన చేతికి రావడానికి ఇంకా కొంతకాలం పట్టొచ్చు. ఇదే కాదు, వేలి ఉంగరంలో నుంచి పనిచేసే రింగ్‌ ఫోను, ఒకేసారి మూడు తెరలపై మూడు ఆప్‌లతో పనిచేసే ఎన్‌ఈసీ ఫ్లిప్‌ ఫోను, ఎలా పడితే అలా మడతపెట్టడానికి వీలయ్యే అరుబిక్స్‌ పోర్టల్‌ ఫోను, పలుచని బుక్‌మార్క్‌ పేపరులా ఉండే నోకియా 888 ఫోనూ... ఇలా ఎన్నో వెరైటీ ఫోన్ల వీడియోలు అభిమానుల్లో ఆశల్ని రేకెత్తిస్తున్నాయి.

రోల్‌ అవుట్‌ ఫోను

వాచీలోనో ఉంగరంలోనో ఫోను పరకాయ ప్రవేశం చేస్తే అదొక పద్ధతి. అలా కాకుండా అసలు కన్పించకుండా ఉంటే..! సీ త్రూ ఫోను అలాంటిదే. ఒట్టి గాజుపలకలా లోపల ఏమీ లేనట్లు కన్పించే ఈ ఫోను మామూలు స్మార్ట్‌ఫోనులానే పనిచేస్తుందట. ఇక హోలోగ్రఫిక్‌ ఫోను అయితే మరీ హాయి. ఎవరైనా ఎత్తుకుపోతారన్న భయం ఉండదు. ఎందుకంటే చిన్నగా ఉండే ఈ ఫోనుని వాడేటప్పుడు చేతి మీదో టేబుల్‌ మీదో ఎక్కడ కావాలంటే అక్కడ ఫోను తెర కీబోర్డుతో సహా కాంతిలా పరుచుకుంటుంది. కొత్త తరం ఫోన్ల జాబితాలో చిప్‌ ఫోను కూడా ఉంది. దీన్ని ఇయర్‌ఫోన్‌లా చెవికి అమర్చుకుంటే హోలోగ్రామ్‌ లాగా తెర మన కళ్లముందు గాల్లోనే కనిపిస్తుంది. అసలు దాన్ని టచ్‌ చేయనక్కరలేకుండా మాటతోనే ఈ ఫోనుని పనిచేయించవచ్చట.

ఏమో... ఫోన్‌ ఎగరావచ్చు!

మనం ఏ కిచెన్‌లోనో బెడ్‌రూమ్‌లోనో పనిచేసుకుంటున్నప్పుడు డ్రాయింగ్‌రూమ్‌లో ఉన్న ఫోన్‌ మోగితే చేతిలో పని ఆపి వెళ్లి ఫోన్‌ చేతిలోకి తీసుకుని మాట్లాడతాం. అలా మన చేతిలో పనికి ఆటంకం కలగకుండా ఫోనే గాల్లో తేలి వచ్చి మన ఎదురుగా ఎగురుతూ మనం మాట్లాడే పని అయిపోగానే దానంతటదే వెళ్లి టేబుల్‌మీద నిలబడితే..? ఇదేదో సైన్స్‌ఫిక్షన్‌ సినిమాలోని దృశ్యం కాదు, అలాంటి ఫోను తయారుచేయాలన్న ఆలోచనా చేశారు. ఎల్జీ యూ ప్లస్‌ పేరుతో ఇలాంటి డ్రోన్‌ ఫోను గురించి చక్కగా ఎడిట్‌ చేసిన వీడియో ఒకటి అభిమానుల్ని అలరిస్తోంది. అందులో ఫోనుకి వెనక వైపున రెండు ప్రొపెల్లర్లు కూడా కన్పిస్తాయి. ఫోను ఎగరాలంటే ప్రొపెల్లర్లు తిరగాలి. ఆ శబ్దంలో నిజానికి ఫోను వినపడదు. లాజిక్‌ని పక్కన పెడితే- ఆ ఐడియాని అందిపుచ్చుకుని ఎవరైనా అలా పనిచేసే ఫోనుని తయారుచేయకపోతారా అన్నది ఈ మోడల్‌ సృష్టికర్తల ఆలోచన కావచ్చు. లేదా ఆ కంపెనీనే అలాంటి పరిశోధన ఏమైనా చేస్తూండవచ్చు.

మన ఇష్టాల్ని తెలుసుకుని...

కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సాంకేతికతలను ఫోనుల్లో ఇప్పటికే వాడుతున్నాం. అది ఇంకా పెరిగితే మన ఇష్టాల్నీ అవసరాల్నీ తెలుసుకుని తదనుగుణంగా వ్యవహరించే ఫోను తయారుచేయడం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ఒక మీటింగ్‌కి వెళ్లారనుకోండి. మీతో పాటు ఆ మీటింగ్‌లో పాల్గొన్నవారి వివరాలన్నీ కావాలంటే నిర్వాహకుల్ని బతిమాలుకోవాలి. అదే కృత్రిమమేధ సాయం ఉంటే మన ఫోనే అక్కడున్న వారందరి ఫోన్లనుంచి సమాచారాన్ని సేకరించగలదు. కెమెరా సాయంతో ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయగలదు. ఇదంతా మన ప్రమేయం లేకుండా బ్యాక్‌గ్రౌండ్‌లోనే జరిగిపోతుంది. ఒక వార్తాపత్రిక చదవడం మీకు అలవాటు. కానీ మీకు నచ్చే వార్తల్ని వెతుక్కుంటూ ఆ పేజీలన్నీ తిప్పాలంటే చిరాకు. మీ ఫోన్‌ మీకు నచ్చిన వార్తలు మాత్రమే కనపడేలా చేయగలదు. ఇంకా వర్చువల్‌, ఆగ్మెంటెడ్‌ రియాలిటీలూ.. ఫోను పనితీరును మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి.

సెల్‌ఫోన్‌ మీద సాగుతున్న చిత్ర విచిత్ర ఊహాగానాలూ పరిశోధనలను చూస్తుంటే... ఇవ్వాళో రేపో- కాల్‌ వచ్చినప్పుడు మనం ఎక్కడ కూర్చోనుంటే అక్కడికి ఫోను ఎగురుకుంటూ వచ్చేస్తుందేమో, మనసెరిగి తనంతట తానే జొమాటోకు ఐస్‌క్రీమ్‌ ఆర్డరిచ్చేస్తుందేమో... అనిపించడం లేదూ! రావణుడి పుష్పక విమానానికి రూపమిచ్చిన మనిషికి... గాంధారి నూటొక్క కుండల పిండాల కథను నిజం చేసిన మనిషికి... ఇదీ ఏమంత కష్టం కాదు. కాకపోతే, అది ‘ఎంత త్వరగా’ అన్నదే ప్రశ్న!

ఇలాంటిది ఒక్కటుంటే చాలట!

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... తోడొకరుండిన అదే భాగ్యమూ... అన్నారు సినీకవి. అలా ప్రేమించి మంచి స్నేహితుడిలా మనని వెన్నంటి ఉండే ఫోన్‌ ఒకటి ఉంటే అదే భాగ్యమూ అని పాడుకునే రోజూ వచ్చేటట్లే ఉంది. జులియస్‌ టాంగ్‌ అచ్చం అలాంటి ఫోనునే డిజైన్‌ చేశాడు. ‘ద మొడాయ్‌’ అనే ఈ ఫోను మనం లేవగానే గుడ్‌మార్నింగ్‌ చెబుతుంది. పేపర్లో లీనమైపోతే ఆఫీసుకు టైమవుతోందని హెచ్చరిస్తుంది. ఆలస్యంగా నిద్ర లేస్తే త్వరగా తెమిలేందుకు షెడ్యూల్‌ని మారుస్తుంది. కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడేం చూడొచ్చో ఏమేం కొనుక్కోవచ్చో చెబుతుంది. ఉద్యోగజీవితాన్నీ వ్యక్తిగత జీవితాన్నీ విడదీసి ఎక్కడ ఏం చేయాలో అవి మాత్రమే చేసేలా చూస్తుంది. ఒక మనసైన మిత్రుడు పక్కన ఉంటే మీకెంత భరోసాగా ఉంటుందో ఈ ఫోన్‌ ఉంటే అచ్చం అలాగే ఉంటుందంటాడు టాంగ్‌. కాకపోతే ఎవరైనా ఈ డిజైన్ని అందిపుచ్చుకుని ఫోన్‌ని తయారుచేయాలి మరి!

ఇదీ చూడండి:కార్డు అప్పుల్లో చిక్కుకోకుండా ఇలా చేయండి..!

ABOUT THE AUTHOR

...view details