వాట్సాప్.. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారిలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ఈ యాప్‌ను వాడుతున్నారు. కేవలం మన దేశంలోనే 40 కోట్ల మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ యాప్ ఇంత ఎక్కువ మందికి చేరువ కావడానికి ప్రధాన కారణం.. అందులో ఉండే ఫీచర్లు. యూజర్లను ఆకర్షించేందుకు వాట్సాప్ అదే తరహాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్లు తెస్తుంది. తాజాగా భారీ ఎత్తున కొత్త ఫీచర్లు తెచ్చేందుకు సిద్ధమైంది ఫేస్‌బుక్‌కు చెందిన మెసెంజర్ దిగ్గజం. ఈ సారి తీసుకొచ్చే ఫీచర్లపై భారీ అంచనాలున్నాయి. మరి ఆ ఫీచర్లేంటి? వాటి ఉపయోగమెంత? అనే విషయాలు మీ కోసం.
డార్క్ మోడ్..
వాట్సాప్ ఎప్పటి నుంచో ఊరిస్తున్న కొత్త ఫీచర్.. డార్క్ మోడ్. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ ఇంటర్ఫేస్ సహా.. అన్ని ఆప్షన్లు కేవలం లేత రంగుల్లోకి మార్చుకునే సౌలభ్యం ఉండనుంది. దీని ద్వారా రాత్రి పూట వాట్సాప్ వాడేందుకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫోన్ ఛార్జింగ్ ఎక్కువసేపు వస్తుంది. ప్రస్తుతం బీటా వెర్షన్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. త్వరలోనే యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
బూమరాంగ్ ఫీచర్..
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ బూమరాంగ్. ఏదైన ఫొటోను సరదాగా స్వల్ప నిడివిగల వీడియోగా మార్చడమే ఈ ఫీచర్లో ఉన్న సౌకర్యం. ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్ తెగ హల్చల్ చేస్తోంది. అలాంటి ఫీచర్‌ను తమ వినియోగదారులకు అందించాలని వాట్సాప్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి వచ్చే వీలుంది.