ఆన్లైన్ క్యాబ్ సేవల సంస్థ 'ఉబర్' తమ ప్రయాణికులకు ఉచిత బీమా అందించనున్నట్లు ప్రకటించింది. కార్లు, ఆటోలు, మోటార్‌సైకిళ్లు వంటి విభాగాల్లో ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగితే బీమా ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రమాదంలో మరణం లేదా వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల వరకు, ఆసుపత్రి పాలైతే రూ.2 లక్షల వరకు ప్రయాణికులు బీమా పొందొచ్చు. ఇందులో ఔట్ పేషెంట్ కింద రూ.50,000 వరకు బీమా పొందే సౌలభ్యం ఉంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 నగరాల్లో 'ఉబర్' సేవలు అందిస్తోంది. కారు ప్రయాణాలకు బీమా కోసం భారతీ యాక్సా, ఆటో, మోటార్ ప్రయాణాలకు బీమా కోసం టాటా ఏఐజీలతో ఉబర్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పటికే డ్రైవర్లకు బీమా అందిస్తున్నామని, తాజా నిర్ణయంతో ప్రయాణికులకు మరింత భద్రత లభిస్తుందని 'ఉబర్' హెడ్ (భారత్, దక్షిణాసియా సెంట్రల్ ఆపరేషన్స్ (రైడ్స్)) పవన్ వైశ్ పేర్కొన్నారు.