భావ వ్యక్తీకరణకు సామాజిక మాధ్యమాలు వేదికగా పనిచేస్తాయి. ఇందులో ట్విటర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ట్విటర్ ఓపెన్ చేయగానే ఆ రోజులో ఏయే అంశాల గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు, ఏయే విషయాలు ట్రెండింగ్‌లో ఉన్నాయనేది ఒక జాబితా రూపంలో మనకు సూచిస్తుంది. వాటిలో కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు జరిగిన సంఘటనలైతే ఎలాంటి ప్రాముఖ్యం లేని అంశాలు కూడా ట్రెండ్ అవుతుంటాయి.
అయితే అవి ఎందుకు ట్రెండ్ అవుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా వాటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారనేది చాలా మందిని యూజర్స్‌ని వేధించే ప్రశ్న. అలా ‘వై ఈజ్ దిస్ ట్రెండింగ్’ (Why Is This Trending?) అనే పదాన్ని ఇప్పటి వరకు 5 లక్షల సార్లు ట్వీట్ చేశారట. దీంతో ట్విటర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక అంశం ఎందుకు ట్రెండ్ అవుతుందనేది వివరిస్తూ పిన్ ట్వీట్స్ లేదా డెస్క్రిప్షన్‌ను వాటికి జోడించనుంది. దాని వల్ల నెటిజన్లు ఆ అంశం ఎందుకు ట్రెండింగ్‌లో ఉందనేది సులభంగా అర్థం చేసుకుంటారని కంపెనీ తెలిపింది.