ప్రముఖుల ఖాతాల హ్యాకింగ్‌పై సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ మరిన్ని వివరాలు వెల్లడించింది. యాక్సెస్ కోసం తమ సంస్థ ఉద్యోగులను మోసం చేయటానికి ఫోన్‌ను ఉపయోగించినట్లు గురువారం తెలిపింది. కొంత మంది ఉద్యోగులే లక్ష్యంగా 'ఫోన్ స్పియర్ ఫిషింగ్' ద్వారా దాడి చేసినట్లు స్పష్టం చేసింది.
"ఈ దాడితో కొంతమంది ఉద్యోగులను తప్పుదారి పట్టించి మా అంతర్గత వ్యవస్థలకు యాక్సెస్ పొందడానికి ప్రయత్నించారు. మానవ తప్పిదాలను ఆసరాగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు."
- ట్విట్టర్ ప్రకటన.
దర్యాప్తు తర్వాతే..
అయితే హ్యాకింగ్ ఎలా జరిగిందన్న విషయంపై పూర్తి సమాచారాన్ని ట్విట్టర్ వెల్లడించలేదు. న్యాయపరమైన దర్యాప్తు పూర్తయ్యాక అన్ని విషయాలు బహిర్గతం చేస్తామని వివరించారు అధికారులు.
భారీ హ్యాకింగ్..
బరాక్ ఒబామా, బిల్ గేట్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, కిమ్ కర్దాషియాన్ వంటి ప్రముఖుల ఖాతాలు హ్యాక్‌కు గురయ్యాయి. బిట్‌కాయిన్ ద్వారా డబ్బు పంపాలని ఈ ఖాతాల నుంచి హ్యాకర్లు పిలుపునిచ్చారు. వీరి ఫాలోవర్ల నుంచి డబ్బు కాజేయాలని ఈ భారీ హ్యాకింగ్‌కు పాల్పడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా 130మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ చేసినట్లు ట్విట్టర్ అంగీకరించింది. జులై 15న జరిగిన ఈ దాడిలో 45 ఖాతాల పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు రీసెట్ చేయగలిగారని తెలిపింది. 36 మంది మెస్సేజ్ ఇన్‌బాక్స్‌లను యాక్సెస్ చేయగలిగారు. 7 ఖాతాల నుంచి ట్విట్టర్ సమాచారాన్ని డౌన్లోడ్ చేశారు.
స్పియర్ ఫిషింగ్ అంటే..
హ్యాకింగ్‌లో స్పియర్ ఫిషింగ్ అనేది మరింత లక్షితంగా దాడులు చేసేందుకు వినియోగిస్తారు. సున్నితమైన సమాచారాన్ని పొందేందుకు ఈమెయిల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల ద్వారా మోసగిస్తారు.
ఇదీ చూడండి:తప్పు జరిగింది.. క్షమించండి: ట్విట్టర్