కేబుల్ టీవీ, డీటీహెచ్ వినియోగదారులకు టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' శుభవార్త తెలిపింది. టీవీ ఛానెళ్ల వీక్షణలో ఛార్జీల మోతపై పునరాలోచించనున్నట్లు ప్రకటించింది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కేబుల్ టీవీ, డీటీహెచ్లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది ట్రాయ్. వీటి కారణంగా గతంతో పోలిస్తే.. ప్రస్తుతం కేబుల్ టీవీ, డీటీహెచ్ల నెలవారీ చందాలు భారీగా పెరిగాయి. ఈ విషయంపై చాలా మంది ధరలు తగ్గించాలని తమకు ఫిర్యాదు చేసినట్లు ట్రాయ్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా సవరణలు చేసేందుకు యోచిస్తున్నట్లు పేర్కొంది.
ట్రాయ్ ఏమందంటే..
కేబుల్ టీవీ రంగంలో పారదర్శకతే ప్రాథమిక లక్ష్యంగా కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు ట్రాయ్ స్పష్టం చేసింది. అయితే ఈ కారణంగా ధరలు పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించింది.
ముఖ్యంగా కొత్త నిబంధనలతో నిర్దిష్ట ఎన్సీఎఫ్ ఛార్జీలను అమలు చేస్తోంది ట్రాయ్. ఫలితంగా ప్రతీ వినియోగదారు ఏదైనా పే ఛానల్ చూడాలన్నా రూ.153 ఎన్సీఎఫ్ ఛార్జీని తప్పనిసరిగా చెల్లించాలి. ఇంతకుముందు ఇలాంటి నిబంధన లేదు. ఛార్జీలు పెరిగేందుకు ఇదీ ఒక కారణమైంది.