'ట్రాయ్' కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో కేబుల్ టీవీ, డీటీహెచ్ సర్వీసుల ముఖ చిత్రం పూర్తిగా మారింది. డీటీహెచ్‌ల ధరల్లోనూ మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా మంది తమ సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకునే పనిలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ 'డీటీహెచ్' తీసుకోవడం మంచిదని ఆలోచిస్తుంటారు చాలా మంది. ఆ సందేహాలు తీరాలంటే ఈ వార్త చదవాల్సిందే.
టాటా స్కై
గత కొన్నేళ్లుగా ఉత్తమ డీటీహెచ్ ఆపరేటర్‌గా టాటా స్కై కొనసాగుతోంది. 'ట్రాయ్' కొత్త నిబంధనలతో టాటా స్కై సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. లైట్ ప్యాక్, మినీ ప్యాక్ వంటి ఆఫర్లతో వినియోగదార్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. వీటితో పాటు వలస ప్రక్రియనూ సలభతరం చేసింది టాటా స్కై.
ఉత్తమ సేవలు అందించడంలో మెరుగ్గా ఉన్నా... 'ట్రాయ్' నిబంధలతో 'మల్టీ టీవీ' సేవల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది టాటా స్కై. ఒక వేళ ఒకటి కన్నా ఎక్కువ టీవీల కోసం టాటా స్కై తీసుకోవాలంటే పునరాలోచించడం మంచిది.
సాధారణ కనెక్షన్ అయితే టాటా స్కై ఉత్తమ సర్వీస్ ప్రొవైడర్ అనే చెప్పాలి. పైగా టాటా స్కై ఇటీవల ఎస్డీ, హెచ్డీ సెట్‌టాప్ బాక్స్‌లపై రూ. 400 ధర తగ్గించింది.
డీ2హెచ్
'ట్రాయ్' కొత్త నిబంధనలు తీసుకువచ్చిన తర్వాత 'డీ2హెచ్' మరో ఉత్తమ సర్వీస్ ప్రొవైడర్‌గా పేరుతెచ్చుకుంది. మల్టీ టీవీ సేవల్లో ఈ సంస్థ మంచి ఎకనామిక్ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. నెట్వర్క్ కెపాసిటీ ఫీ (ఎన్సీపీ)ని రూ.50 నుంచి ప్రారంభించింది. వీటికి తోడు తమ వినియోగదారుల నుంచి ఉత్తమ రివ్యూలు పొందుతోంది డీ2హెచ్. 'ట్రాయ్' కొత్త నిబంధనల్లో డీటీహెచ్ ఆపరేటర్లు తమ సేవల్లో నాణ్యత కచ్చితంగా పాటించాలని హెచ్చరించడం కూడా ఇందుకు కారణం అని చెప్పాలి.