సంక్షిప్త సందేశాల సంస్థల్లో వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకు తగినట్లే తమ వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ సంస్థ. ఇలా ఈ ఏడాది ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు తెచ్చిన ఫీచర్లలో.. యూజర్లు బాగా వినియోగిస్తున్నవి, ఉపయోగకరంగా ఉన్న కొన్నిటి గురించి తెలుసుకుందాం.
ఫింగర్ ప్రింట్ లాక్..
వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత భద్రత విషయంలో వాట్సాప్ ఈ సారి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చింది. ఎన్నో కొత్త ఫీచర్లు తీసుకువచ్చింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫింగర్ ప్రింట్ లాక్. వాట్సాప్‌ను ఇతరులు చూడకుండా ఉండేందుకు ఇప్పటి వరకు థర్డ్ పార్టీ యాప్‌లు వాడాల్సి వచ్చేది. దీనిపై వినియోగదారుల నుంచి భారీగా వినతులు అందుకున్న వాట్సాప్ ఎట్టకేలకు.. బిల్ట్ఇన్ ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్‌ను తీసుకువచ్చింది.
నకిలీ వార్తలకు బ్రేక్..
వాట్సాప్ ద్వారా నకిలీ వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సర్వత్రా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సున్నితమైన అంశాలు, ఆర్థిక పరమైన అంశాల్లో వీటి వల్ల చాలా నష్టాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఫ్రీక్వెన్ట్లీ ఫార్వర్డెడ్ అనే ఆప్షన్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా వాట్సాప్ యూజర్లు ఫార్వర్డ్ చేసే.. సందేశాలపై పరిమితులు విధించింది. ఫలితంగా ఒకే సందేశాన్ని ఐదు సార్లకన్నా ఎక్కువగా పంపేందుకు వీలు లేదు.
నకిలీ వార్తలను అరికట్టేందుకు విసృతంగా ప్రచారం కూడా చేసింది వాట్సాప్.
గ్రూప్ వీడియోకాల్, వాయిస్ కాల్
వాట్సాప్‌లో ఆడియో, వీడియో కాల్ ఫీచర్లు ఇంతకు ముందు నుంచే ఉన్నాయి. అయితే ఈ ఫీచర్లను మరింత ఆకర్షణీయంగా చేసేందుకు గ్రూప్ కాల్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఒకే సారి గరిష్ఠంగా నలుగురు గ్రూప్‌గా వీడియోకాల్‌లో మాట్లాడే వీలుంది.
గ్రూప్ ప్రైవసీ మరింత పటిష్ఠం
ఇంతకుముందు వరకు ఎవరి దగ్గర మీ ఫోన్ నెంబర్ ఉన్నా.. వారు మిమ్మల్ని ఏదైనా వాట్సాప్ గ్రూపులో సభ్యులుగా చేర్చొచ్చు. కొన్ని సార్లు గుర్తు తెలియని వ్యక్తులూ.. గ్రూపుల్లో చేర్చడం వీలవుతుంది. ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు ఇటీవలే కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది వాట్సాప్.
ఈ అప్డేట్తో గ్రూపులో మిమ్మల్ని ఎవరు చేర్చాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. అదెలా అంటే కొత్త అప్డేట్ ప్రైవసీ సెట్టింగుల్లో గ్రూపు అడ్మిన్‌పై క్లిక్ చేసి.. అందులో ఎవిరీవన్, మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి.
- ఎవిరీవన్ను ఎంపిక చేసుకుంటే.. ఎవరైనా మిమ్మల్ని గ్రూపులో చేర్చేందుకు వీలుంటుంది.
- మై కాంటాక్ట్స్ ఎంపిక చేసుకుంటే.. మీ ఫోన్‌బుక్‌లో నంబర్ సేవ్ చేసుకున్న వ్యక్తులు తప్ప ఇతరులెవ్వరూ మిమ్మల్ని గ్రూపుల్లో చేర్చడం వీలుకాదు.
- మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్తో.. మీరు నంబర్ సేవ్ చేసుకున్న వారిలోనూ.. ఎవరు మిమ్మల్ని గ్రూపులో చేర్చాలి.. ఎవరు చేర్చకూడదు అనేది నిర్ణయించొచ్చు.
వాయిస్ నోట్ ప్లే సులభతరం..
వాట్సాప్‌లో సంక్షిప్త సందేశాలతోపాటు వాయిస్ నోట్ సందేశాలు పంపే వీలుంది. కీబోర్డ్ పై టైప్ చేసే పని లేకుండా ఉండేందుకు ఈ ఫీచర్ పని చేస్తుంది. అయితే ఫీచర్ ద్వారా ఒకే సారి 10(ఉదాహరణకు) వాయిస్ సందేశాలు వస్తే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ప్లే చేయాల్సి వచ్చేది. వాయిస్ నోట్లో తీసుకువచ్చిన కొత్త ఫీచర్‌తో ఒక్క సారి వాయిస్ నోట్ ప్లే చేస్తే ఆ వరుసలో ఉన్న సందేశాలన్నీ ఒకదాని వెంట మరోటి ప్లే అవుతాయి.
వీటితో పాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్లను వాట్సాప్ ఈ ఏడాది తీసుకువచ్చింది. భవిష్యత్‌లో ఇంకా తీసుకురానుంది.
ఇదీ చూడండి:2019-20లో దేశ జీడీపీ వృద్ధిరేటు 5.1 శాతమే!