చైనాకు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్‌లు టిక్‌టాక్, హలోలు భారత వ్యాపారాల నుంచి పూర్తిగా తప్పుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని టిక్‌టాక్, హలో యాప్‌ల మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ ప్రకటించింది. భారత్‌లో తమ సంస్థలపై నిషేధం కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.
2 వేల మంది ఉద్యోగులపై ప్రభావం..
ఈ మేరకు టిక్‌టాక్ ఉన్నతాధికారులు సంయుక్తంగా కంపెనీ నిర్ణయాన్ని ఈమెయిల్ ద్వారా తమ ఉద్యోగులకు తెలిపారు. కంపెనీ సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటున్నామని.. దీని ప్రభావం భారత్‌లో ఉన్న ఉద్యోగులందరిపైనా పడుతుందని అందులో పేర్కొన్నారు.
భారత చట్టాలకు అనుగుణంగా కార్యకలాపాలు ఉండేలా అన్ని ప్రయత్నాలు చేసినట్లు టిక్‌టాక్ ప్రతినిధి తెలిపారు. అయినప్పటికీ 7 నెలలుగా యాప్ పునఃప్రారంభంపై ఎలాంటి స్పష్టత రాలేదని పేర్కొన్నారు. నిషేధ సమయంలో తమకు అండగా నిలిచిన 2వేల మంది భారతీయ ఉద్యోగులకు కృతజ్ఞతలు చెప్పారు. తమ నిర్ణయం వారిని బాధించవచ్చని విచారం వ్యక్తం చేశారు.