తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆన్​లైన్ ఆఫర్ల వలలో పడితే.. తప్పదు భారీ మూల్యం - నకిలీ వస్తువులు

ప్రస్తుతం ఆన్​లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. ఇదే అదునుగా ఆన్​లైన్ షాపింగ్​ సంస్థల పేరుతో సైబర్​ నేరాలు పెరిగిపోతున్నాయి. తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయంటూ మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనలు ఎదుర్కొన్న పలువురి అనుభవాలతో పాటు.. అలాంటి మోసాల బారిన పడకుండా ఏం చేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

ఆన్​లైన్ షాపింగ్

By

Published : Sep 19, 2019, 8:21 PM IST

Updated : Oct 1, 2019, 6:24 AM IST

కార్తీక్‌ ఓ కార్పొరేట్‌ సంస్థ ఉద్యోగి. ఫేస్‌బుక్‌లో పోస్టులు చూస్తుండగా.. స్క్రీన్‌పై ఓ ఆఫర్‌ కనిపించింది. రూ.899కే బ్రాండెడ్‌ సంస్థ పవర్‌ బ్యాంకుతో పాటు బ్లూటూత్‌ హెడ్‌సెట్‌.. అంతే అక్కడే ఆగిపోయి.. ఏం ఆలోచించకుండా ఆ లింక్‌పై నొక్కాడు. ఆ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యాడు. గూగుల్‌ పే ద్వారా నిర్ధారిత మొత్తం చెల్లించాడు. మూడురోజుల్లో పార్శిల్‌ ఇంటికి చేరింది. వారం కూడా గడవకముందే అవి పనిచేయడం ఆగిపోయాయి. పవర్‌బ్యాంకు పేరుని తీక్షణంగా పరిశీలిస్తే గానీ తెలియలేదు అది నకిలీదని.

నగరానికి చెందిన హరీశ్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ ప్రముఖ సంస్థ ఆఫర్‌ ప్రకటన చూడగానే ఆర్డర్‌ పెట్టేశాడు. ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేసేశాడు. ప్యాక్‌ వచ్చిన తర్వాత విప్పి చూస్తే అందులో ఉన్నది వేరే బ్రాండు వస్తువు. ఇక్కడ చిత్రమేమిటంటే అతడు ఆర్డర్‌ పెట్టిన బ్రాండెడ్‌ సంస్థకు, పొందిన సంస్థ పేరుకు ఉన్న తేడా ఒక అక్షరం మాత్రమే. ఆ పేరులో మార్పుని గమనించలేక మోసపోయాడు.

నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగిని ఇన్‌స్టాగ్రామ్‌లో.. తక్కువ ధరలకే అందమైన దుస్తులు, ఇతర ఫ్యాషన్‌ ఉత్పత్తులంటూ ఓ పోస్టు చూశారు. కింద ఇచ్చిన లింక్‌తో షాపింగ్‌ సంస్థ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యారు. నాలుగు కుర్తీలను ఆర్డర్‌ చేశారు. రూ.2వేలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించారు. రోజులు గడుస్తున్నా ఆర్డర్‌ రాకపోవడంతో సదరు సంస్థను ఫోన్‌, మెయిల్‌ ద్వారా సంప్రదించినా స్పందన రాలేదు. గూగుల్‌లో ఆ సంస్థ గురించి వెతకగా మోసపూరిత సంస్థ అని తేలింది.

  • గుర్తింపు పొందిన వెబ్‌సైట్లను మాత్రమే ఆశ్రయించాలి. సంబంధిత సైట్‌ వివరాలు అంతర్జాలంలో తెలుసుకోవాలి.
  • సందేహంగా ఉన్న వెబ్‌సైట్‌లో ఒకవేళ షాపింగ్‌ చేయాలనుకున్నా ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’నే ఎంచుకోండి. ముందస్తు చెల్లింపులు వద్దే వద్దు..

నగర వ్యాప్తంగా వందల మంది ఇలాగే ఓ సంస్థ ఆన్‌లైన్‌ ప్రకటనల బారినపడి మోసపోయారు. అందరి నుంచి ఆర్డర్లు తీసుకొని డబ్బులు సేకరించి తర్వాత ఎవరికీ చెప్పకుండా సంస్థ వెబ్‌సైట్‌ని మూసేశారని బాధితులు భారత వినియోగదారుల ఫిర్యాదుల ఫోరంలో గోడు వెల్లబోసుకున్నారు. ఒకరు దాదాపు రూ.4వేలు, మరొకరు రూ.3వేలు.. ఇలా నెలరోజుల వ్యవధిలోనే వందలమంది ఆర్డర్లు ఇచ్చి మోసపోయారు. అందరిదీ చిన్నమొత్తం కావడంతో ఎవరూ సైబర్‌ పోలీసులను ఆశ్రయించలేదని అధికారులు తెలిపారు. వెరసి.. ఆన్‌లైన్‌లో ఆఫర్లు, నచ్చిన వస్తువులు, బ్రాండ్ల ప్రకటనలు కనిపించగానే తగిన జాగ్రత్తలు తీసుకోకుండా చెల్లింపులు జరుపుతూ నగరంలో చాలా మంది మోసపోవడం పరిపాటిగా మారిపోయింది.

సామాజిక మాధ్యమాలే వేదికగా..

ప్రస్తుతం విరివిగా పెరుగుతున్న సామాజిక మాధ్యమాల వాడకమే అదనుగా రెచ్చిపోతున్నారు సైబర్‌ కేటుగాళ్లు. ప్రముఖ సంస్థల పేర్లతో నకిలీ వెబ్‌సైట్లు తయారుచేసి ఎక్కువ మందిని అటువైపు తిప్పుకుంటున్నారు. తక్కువ ధరకు బ్రాండెడ్‌ వస్తువులనే ప్రకటన చూడగానే ఆ వెబ్‌సైట్‌ లోపలికి వెళ్తున్నారు జనం. ఆన్‌లైన్‌ చెల్లింపులు అందరికీ అందుబాటులోకి రావడంతో అప్పటికప్పుడు డబ్బులు వారి ఖాతాల్లో వేయించుకుని దుకాణం సర్దేస్తున్నారు. ఇటీవలే నగరంలో జరిగిన ఓ సంస్థ మోసం ఈ సామాజిక మాధ్యమాల వేదికగానే జరిగింది. నెలరోజుల్లోనే ఎక్కువ మందిని ఇది చేరడంతో వారంతా ఆ సంస్థ బుట్టలో పడి సొమ్ము పోగొట్టుకున్నారు.

మధ్య తరగతి యువతే అధికం..

నగరంలో ఎక్కువ శాతం వివిధ ప్రాంతాలనుంచి వచ్చినవారే ఉన్నారు. ఉద్యోగాలు, చదువు తదితర అవసరాల కోసం పలు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న యువత తక్కువ ధరల్లో వచ్చే మంచి వస్తువుల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఇలా తక్కువ ధర ప్రకటన కనిపించగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఆర్డర్‌ చేసేస్తున్నారు. వీరి బలహీనతను సైబర్‌ మోసగాళ్లు సులువుగా సొమ్ము చేసుకుంటున్నారు.

డబ్బులు తిరిగిరావు..

నగరంలో నిత్యం ఆఫర్ల పేరిట జరుగుతున్న ఆన్‌లైన్‌ షాపింగుల్లో ఎక్కువగా మోసాలే జరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ మోసాలకు గురైన బాధితులు సైబర్‌ పోలీసులను ఆశ్రయించినప్పుడు వాళ్లు నిందితులను గుర్తించగలుగుతున్నారు. వారికి చెల్లించిన డబ్బులు మాత్రం పూర్తి స్థాయిలో తిరిగి రావట్లేదు. కేవలం పదిశాతం మాత్రమే డబ్బు రికవరీ అవుతోంది. మిగతా కేసుల్లో అది కష్టంగా మారింది. దీంతో బాధితులు నష్టపోయే ప్రమాదముంది.

నకిలీని గుర్తించండి.. ఫిర్యాదు చేయండి

- అనుమానం వచ్చిన వెంటనే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు అందించండి.
- 100 లేదా 040-27852412 ఫోన్‌ నంబర్లకు సమాచారం అందించండి..
- గుర్తింపు పొందిన సైటేనా కాదా అనే నిర్ధారించుకోండి.. సదరు సంస్థ చిరునామా పరిశీలించాలి.

అన్నింటికీ ఆన్‌లైన్‌పైనే ఆధారపడొద్దు..

-హరినాథ్‌, ఏసీపీ, సైబర్‌ నేరాలు

నచ్చిన వస్తువులు పొందేందుకు నగరంలో విస్తృతమైన అవకాశాలున్నాయి. తక్కువ ధరలకు లభించేవి, ఎక్కువ ధరలకు లభించేవి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కూర్చున్న దగ్గరికే ప్రతీదీ రావాలనే ఆలోచనతో ఎక్కువ మంది సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తప్పనిసరైతేనే ఆన్‌లైన్‌పై ఆధారపడండి.. అదీ షాపింగ్‌ చేయబోయే వెబ్‌సైట్‌ వివరాలు ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాతే ముందుకువెళ్లడం మంచిది. తక్కువ ధరల ఆఫర్లు పెడుతున్నారంటేనే ఏదో లొసుగు దాగి ఉంటుందని గమనించాలి. యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

ఇదీ చూడండి: ఉద్దీపన పథకాలు ఇప్పుడే వద్దు: దువ్వూరి సుబ్పారావు

Last Updated : Oct 1, 2019, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details