కరోనా విజృంభణతో దేశంలో 'హెల్త్ ఎమర్జెన్సీ' తలపిస్తోంది. కొవిడ్ చికిత్సలో కీలకమైన ఆక్సిజన్ అందక రోగులు అవస్థలు పడుతున్నారు. మెడికల్ ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతున్న రోగులకు ఆపన్నహస్తం అందించేందుకు.. ఆస్పత్రులకు చేయూతనిచ్చేందుకు.. సర్కారుకు అండగా నిలించేందుకు మరోసారి ముందుకు వచ్చాయి కార్పొరేట్ సంస్థలు. గతేడాది కరోనా విలయం నేపథ్యంలో వెంటిలేటర్లు అందించిన తరహాలోనే.. ఈ సారి కూడా తమ దాతృత్వాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యాయి.
రిలయన్స్ 'మహా' సాయం..
దేశంలో రోజుకు 2లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. దేశంలో అవసరాలకు తగ్గట్టు ఆక్సిజన్ నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యం లేకపోవడం వల్ల అనేక ఆస్పత్రుల్లో రోగులు అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. నిల్వలు ఉన్నంత వరకు రాష్ట్రాలకు కేంద్రం పంపుతున్నా.. అవి ఎటూ సరిపోవడం లేదు. రోజుకు 60వేల చొప్పున కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో పరిస్థితి మరి ఆందోళనరకంగా మారింది.
దేశంలోని దయనీయ పరిస్థితులను చూసిన కొన్ని పబ్లిక్, ప్రైవేటు సంస్థలు తమ పరిశ్రమల అవసరాలకు వినియోగించే ఆక్సిజన్ నిల్వలను కరోనా చికిత్సకు ఉపయోగించేందుకు అందించాలని నిర్ణయించాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు కరోనా తీవ్రంగా ఎక్కువగా ఉన్న మహారాష్ట్రకు ఆక్సిజన్‌ను అందిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
"మహారాష్ట్ర, కర్ణాటకలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్ భిలాయ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెయిల్ స్టీల్ ప్లాంట్‌లోని అదనపు ఆక్సిజన్ నిల్వలను ఇప్పటికే మహారాష్ట్రకు సరఫరా చేశాయి. మధ్యప్రదేశ్ ఆక్సిజన్ అవసరాలను కూడా భిలాయ్‌లోని సెయిల్ ప్లాంట్ తీర్చుతుంది."
- కేంద్రం ప్రకటన
రిలయన్స్ 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్..
కరోనాకు మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతున్న నేపథ్యంలో ప్రైవేటు రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) రాష్ట్ర సర్కారుకు చేయూత అందించేందుకు ముందుకొచ్చింది.
ఇప్పటికే గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్లాంట్ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ సరఫరా చేయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిందే ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు. బ్లూమ్‌బర్గ్ కూడా ఈ విషయాన్ని రాసుకొచ్చింది. తన పెట్రోలియం కోక్ గ్యాసిఫికేషన్ యూనిట్ల కోసం ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ నిల్వలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వైద్య సేవలకు మళ్లించినట్లు పేర్కొంది.
"ముకేశ్ అంబానీకి చెందిన ఆర్‌ఐఎల్ సంస్థ రాష్ట్రానికి దాదాపు 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ముందుకొచ్చింది."