కరోనా వైరస్ సంక్షోభంలోనూ చైనా కుబేరుల సంపద భారీగా పెరిగింది. 'హరూన్ చైనా రిచ్ లిస్ట్ 2020' తాజా నివేదిక ప్రకారం.. చైనాలో ఈ ఏడాది కొత్తగా 257 మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. దీనితో మొత్తం చైనా బిలియనీర్ల సంఖ్య 878కి పెరిగింది. 1999కి ముందు వరకు చైనాలో ఒక్క బిలియనీర్ కూడా లేరని విషయాన్ని సర్వే గుర్తు చేసింది.
చైనాలో మొత్తం 2,398 మంది వ్యక్తిగత సంపద 290 మిలియన్ డాలర్లకన్నా ఎక్కువగా ఉంది. వీరందరి పూర్తి సంపద 4 ట్రిలియన్ డాలర్లని నివేదిక తెలిపింది. ఈ మొత్తం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ.. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి కన్నా ఎక్కువని వివరించింది.
సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలు..
- ఆన్లైన్ షాపింగ్, ఇతర సేవలకు పెరిగిన గిరాకీతో ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థపాపడుకు జాక్మా సంపద 2019తో పోలిస్తే..45 శాతం వృద్ధి చెంది 58.8 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో చైనాలో అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానాన్ని కొనసాగించారు.
- వీ చాట్ మెసేజింగ్ సర్వీస్ నిర్వహించే టెన్సెంట్ వ్యవస్థాపకుడు మా హుటెంగ్ 57.4 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద గత ఏడాదితో పోలిస్తే 50 శాతం పెరిగింది.
- బాటిల్డ్ వాటర్ బ్రాండ్ నాంగ్ఫూ స్ప్రింగ్ ఛైర్మన్ జాంగ్ షాన్సన్ 53.7 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. సెప్టెంబర్లో జాంగ్ కంపెనీ హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో నమోదు కావడం వల్ల ఈ స్థానాన్ని దక్కించుకున్నారు.
- స్థిరాస్తి సంస్థ కంట్రీ గార్డెన్ అధినేత్రి యాంగ్ హ్యుయాన్ అత్యంత సంపన్న మహిళగా ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఈమె సంపద గత ఏడాదితో పోలిస్తే 29 శాతం పెరిగి.. 33 బిలియన్ డాలర్లకు చేరింది.
- ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ 'జూమ్' వ్యవస్థాపకుడు ఎరిక్ యువాన్ సంపద 10 బిలియన్ డాలర్లు పెరిగి.. మొత్తం ఆస్తి 16.2 బిలియన్ డాలర్లకు చేరింది.
- ఆఫ్సిన్ అధిపతి లీ యాంగ్సిన్ సంపద రెట్టింపై 20.6 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఇదీ చూడండి:గూగుల్ సంస్థపై అమెరికా న్యాయశాఖ దావా