తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రైవసీకి పెద్దపీట.. గూగుల్​ సరికొత్త ఆలోచన - వాణిజ్యం వార్తలు

నెట్టింట్లో గూగుల్‌ చేయని రోజుండదు..అందుకే మనం ఏం వెతుకుతున్నాం? ఎక్కడెక్కడ తిరుగుతున్నాం? ఏం చూస్తున్నాం?.. అన్నీ గూగుల్‌ ఓ కంటకనిపెడుతుంది. అప్పుడు యూజర్‌గా మన ప్రైవసీ మాటేంటి? మనం ఏం చేస్తున్నామో అన్నీ గూగుల్‌కి తెలియాలా? అక్కర్లేదు అనుకుంటే.. ఏం చేయాలి? గూగుల్‌ కొత్తగా అందిస్తున్న ప్రైవసీ అప్‌డేట్స్‌ని అందిపుచ్చుకుంటే సరి! వినియోగదారుల ప్రైవసీకి పెద్దపీట వేస్తూ పలు సర్వీసుల్లో ఇన్‌కాగ్నిటో మోడ్‌ని పరిచయం చేస్తోంది!

గూగుల్ ప్రైవసీ కోసం సరికొత్త ఆలోచన

By

Published : Oct 30, 2019, 11:30 AM IST

గతంలో అంతర్జాలంలో అడుగు పెట్టేందుకు ఎక్కువగా బ్రౌజర్‌ని వాడుకునే వాళ్లం. ఇప్పుడు యాప్‌లు కూడా అందుకు వేదిక అవుతున్నాయి. ఉదాహరణ ‘గూగుల్‌ గో’ యాప్‌. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు వెబ్‌ విహారాన్ని మరింత సులభం చేసేసింది. ఏది వెతకాలన్నా.. ఏం చూడాలన్నా.. అన్నింటినీ గుత్తగా ఒకేచోట అందిస్తోంది. ఇంకేముందీ హాయిగా వాడేస్తున్నాం. అయితే, మీ ఫోన్‌ని ఇతరులు యాక్సెస్‌ చేసే వీలున్నప్పుడు మీరు ఏయే అవసరాలకు అంతర్జాలాన్ని వాడుతున్నారో తెలిసిపోతుంది. అలా ఇతరులుకు తెలియకూడదు అనుకుంటే యాప్‌లో ‘ఇన్‌కాగ్నిటో’ మోడ్‌ ఉందా? బ్రౌజర్లలో మాత్రమే ఆప్షన్‌ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. పబ్లిక్‌ ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్‌లను వాడాల్సి వస్తే బ్రౌజర్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్‌ని సెలెక్ట్‌ చేసి వాడేస్తున్నాం. ఇదే మాదిరిగా ‘గూగుల్‌ గో’లో ఇకపై ఇన్‌కాగ్నిటో మోడ్‌ని ఎంపిక చేసుకోవచ్చు. యాప్‌లో సెర్చ్‌ బాక్స్‌కి కుడి పక్కనే 'Incognito'icon ఆప్షన్‌ని నిక్షిప్తం చేయనున్నారు. త్వరలోనే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ల్లో ఆప్షన్‌ ప్రత్యక్షం కానుంది. ఇన్‌కాగ్నిటో మోడ్‌ని ఎనేబుల్‌ చేస్తే చాలు. యాప్‌లో మీ వెబ్‌ విహారం గోప్యంగా ఉంటుంది. ఇంచుమించు 12 భాషల్లోని ఆప్షన్‌ని అందుబాటులోకి తేనున్నారు.

గూగుల్​ మ్యాప్స్​ మాటేంటి?

పొద్దున నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకూ ఎక్కడెక్కడ తిరిగారో ఎవ్వరికీ తెలియదులే అనుకుంటారు. కానీ, గూగుల్‌ మాత్రం ఆ గుట్టంతా భద్రం చేస్తుంది. మీరు ఏ సమయానికి ఎక్కడున్నారు? మొత్తం గూగుల్‌ మ్యాపుల్లో భద్రం అవుతుంది. మీ గూగుల్‌ ఎకౌంట్‌ని యాక్సెస్‌ చేయగలిగితే నిర్ణీత సమమయానికి మీరు ఎక్కడ ఉన్నారో పట్టేయొచ్చు. అప్పుడు ప్రైవసీ మాటేంటి? ట్రాకింగ్‌ వద్దనుకుంటే మ్యాప్స్‌లో బిల్ట్‌ఇన్‌గా ‘టర్న్‌ ఆన్‌ ఇన్‌కాగ్నిటో మోడ్‌’ ఆప్షన్‌ అందుబాటులోకి రానుంది. త్వరలోనే గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో చూడొచ్చు. యాప్‌లోకి వెళ్లి ప్రొఫైల్‌ పిక్‌పై తాకితే డ్రాప్‌డౌన్‌ మెనూ వస్తుంది. దాంట్లో ఇన్‌కాగ్నిటో మోడ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆప్షన్‌ని ‘టర్న్‌ ఆఫ్‌’ చేస్తే చాలు. లొకేషన్‌ ట్రాకింగ్‌ ఆగిపోతుంది. ఇక మీరు ఎక్కడ తిరిగినా రికార్డు అవ్వదు. అవసరం అనుకున్నప్పుడు తిరిగి ‘టర్న్‌ ఆన్‌’ చేయండి.

'గూగుల్​ గో' లో ఇవి తెలుసా?

వెబ్‌ విహారాన్ని మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చేస్తోంది గూగుల్‌ గో. సంప్రదాయ పద్ధతిలో బ్రౌజింగ్‌ చేసి విసుగొస్తే ఈ యాప్‌ని ప్రయత్నించొచ్చు. వెబ్‌సైట్‌లను ఓపెన్‌ చేయడమే కాదు. దాంట్లోని వ్యాసాల్ని మీకు చదివే అవసరం లేకుండా, యాప్‌ చదివి వినిపిస్తుంది. నచ్చిన వ్యాసాల్ని షేర్‌ చేయడం కూడా సులువే. గూగుల్‌ లెన్స్‌తో అనువాదం చేయొచ్చు. మీకు రాని భాషలో ఏదైనా రాసుంటే.. దాన్ని గూగుల్‌ లెన్స్‌తో ఫొటో తీసి కావాల్సిన భాషలోకి ట్రాన్స్‌లేట్‌ చేయొచ్చు. సైన్‌బోర్డులు, బస్సు పేర్లు.. మీకు అర్థం కానివి ఏవైనా ఎంపిక చేసుకున్న భాషలోకి మార్చేస్తుంది. అంతేకాదు.. ఫొటో తీసిన వ్యాసాల్ని చదివి వినిపిస్తుంది.

ఇప్పటికే యూట్యూబ్​లో

గంటల కొద్దీ వీక్షించే యూట్యూబ్‌లో ప్రైవసీ మాటేంటి? మీరు చూసే యూట్యూబ్‌ వీడియోలు ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు అనుకుంటే గూగుల్‌ ఇప్పటికే పరిచయం చేసిన ఇన్‌కాగ్నిటో మోడ్‌ని సెలెక్ట్‌ చేయొచ్చు. దీంతో యూట్యూబ్‌లో మీరు వీక్షించే హిస్టరీ ఏదీ ఫోన్‌లో సేవ్‌ అవ్వదు. తిరిగి ఎప్పుడైనా ఇన్‌కాగ్నిటో మోడ్‌ని ఆన్‌ చేస్తే కీవర్డులు, వీడియోలు... అన్నీ గూగుల్‌ ఎకౌంట్‌లో ట్రాక్‌ అవుతాయి. దీంతో పాటు యూట్యూబ్‌ హిస్టరీని ఆటోమేటిక్‌గా డిలీట్‌ చేసేందుకు గూగుల్‌ ‘ఆటో డిలీట్‌’ ఆప్షన్‌ని పరిచయం చేయనుంది. ఎంపిక చేసుకున్న నిర్ణీత సమయానికి ఆటోమేటిక్‌గా హిస్టరీ మొత్తం ఎకౌంట్‌ నుంచి తొలగిపోతుంది. 3, 18 నెలల్ని నిర్ణీత గడువుగా పెట్టుకునే వీలుంది. ఇంకా చెప్పాలంటే.. గూగుల్‌ అసిస్టెంట్‌ని వాడుకుని వినియోగదారుడి ప్రైవసీని వాయిస్‌ కమాండ్స్‌తోనే కంట్రోల్‌ చేయొచ్చు. రానున్న రోజుల్లో గూగుల్‌ అసిస్టెంట్‌ని అడిగి మీ ఎకౌంట్‌కు ఉన్న ప్రైవసీ ఏంటో తెలుసుకోవచ్చు. ‘హే గూగుల్‌.. హౌ డు యూ కీప్‌ మై డేటా సేఫ్‌?’ అని అడిగితే చాలు. మీ ప్రైవసీని విశ్లేషిస్తుంది. అసిస్టెంట్‌తో చేసిన సంభాషణల్ని తొలగించేందుకూ వాయిస్‌ కమాండ్స్‌ని వాడొచ్చు.

ఇదీ చూడండి : బ్రిటన్​ ఎన్నికలకు విపక్షం అంగీకారం

ABOUT THE AUTHOR

...view details