తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ నిపుణుల్లారా.. ఇక ఇంటికి వెళ్లండి..! - వేతనాల రూపంలో ఆర్థిక భారం

ఐటీరంగం మళ్లీ ఒడిదొడుకులకు గురవుతోంది. ప్రతిఏటా కొత్త ప్రాజెక్టుల సమయంలో సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు కొనసాగే బలవంత తొలగింపులు ఈ ఏడాదిలో భారీగా పెరిగాయి. వేతనాల రూపంలో ఆర్థిక భారం,కొత్త టెక్నాలజీలతో పాటు తాజాగా ఆర్థిక మాంద్యం ప్రభావం పేరిట సీనియర్‌ ఐటీ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ కంపెనీల ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

ఐటీ నిపుణుల మెడపై కత్తి

By

Published : Nov 20, 2019, 7:36 AM IST

1
హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రూ.14లక్షల వేతన ప్యాకేజీపై పనిచేస్తున్నారు. ఐటీ రంగంలో మంచి అనుభవముంది. నెల రోజుల క్రితం పనితీరు బాగాలేదని, ఉద్యోగం మానేయాలంటూ కబురు అందింది. ఇదేమని అడిగితే స్వచ్ఛందంగా వెళ్తారా... బలవంతంగా బయటకు పంపించాలా? అని అడిగారు. దీంతో చేసేది లేక స్వచ్ఛంద రాజీనామా ఇచ్చారు.

2
మరో కంపెనీలో ఐటీ బృందంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు ‘‘మీ పనితీరు బాగాలేదు. అందుకే ‘డీ’ గ్రేడ్‌ ఇస్తున్నాం’’ అని చెప్పారు. అప్పటి వరకు ఏ గ్రేడ్‌లో కొనసాగిన ఐటీ నిపుణులు ఎందుకు పంపిస్తున్నారని అడగ్గా... పనితీరు బాగాలేదు. ఇంతకు మించి ఏమీ అడగవద్దు అని మేనేజర్‌ చెప్పారు. చేసేదేమీ లేక స్వచ్ఛంద రాజీనామా చేసి వెళ్లిపోయారు.

ఐటీరంగం మళ్లీ ఒడిదొడుకులకు గురవుతోంది. ప్రతిఏటా కొత్త ప్రాజెక్టుల సమయంలో సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు కొనసాగే బలవంత తొలగింపులు ఈ ఏడాదిలో భారీగా పెరిగాయి. వేతనాల రూపంలో ఆర్థిక భారం, అంతర్జాతీయ రక్షణాత్మక ధోరణులు, నూతన ప్రాజెక్టులపై సందిగ్ధత, కొత్త టెక్నాలజీలతో పాటు తాజాగా ఆర్థిక మాంద్యం ప్రభావం పేరిట సీనియర్‌ ఐటీ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. ఇన్ఫోసిస్‌లో ఒకేసారి 10వేల మందిని తొలగించాలన్న నిర్ణయంతో మిగతా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. హైదరాబాద్‌లో కొన్నినెలలుగా బలవంతపు తొలగింపుల పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐటీ నిపుణులు భయంతో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదికి బలవంతపు తొలగింపులు 14 శాతం వరకు ఉంటుందని అంచనా. గత ఏడాదితో పోల్చితే నాలుగైదు శాతం ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.

ఐటీ ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీలు చిన్నచిన్న కారణాలు చూపిస్తున్నాయి. ప్రాజెక్టు మేనేజర్లకు టార్గెట్లు ఇచ్చి మరీ ఉద్యోగులను తొలగించేలా ఆదేశాలు ఇస్తున్నాయి. నిర్ణయం అమలు చేయలేకుంటే మేనేజరును ఇంటికి వెళ్లిపోవాలంటూ సూచిస్తున్నాయి. దీంతో చేసేది లేక కంపెనీ నిర్ణయించిన లక్ష్యం మేరకు ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ‘‘కంపెనీ సూచన మేరకు తప్పనిసరి పది మంది ఉద్యోగులను తొలగించేందుకు గ్రేడింగ్‌ తక్కువగా ఇవ్వాల్సి వచ్చింది. ఉద్యోగం పోతే ఆ బాధ విలువ తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తోంది.’’ అని ఓ కంపెనీ ఉన్నత ఉద్యోగి తెలిపారు. ‘‘ఉద్యోగులను తొలగించేపుడు టెక్నాలజీ, పనితీరు ప్రాధాన్యంగా ఉండేది. ఇప్పుడు అందరూ సాంకేతిక నిపుణులే కానీ, చిన్న చిన్న కారణాలను సాకుగా చూపిస్తున్నారు. అత్యవసరాలకు వెళ్లే సమయాన్ని లెక్కిస్తున్నారు.’’ అని హైదరాబాద్‌లోని ఐటీ నిపుణుడు తెలిపారు.

తక్కువ వేతనాలతో...

ఐటీ రంగంలో అనుభవం మేరకు సీనియర్లకు వేతనాలు ఎక్కువే. సీనియర్లను తొలగించి వారి స్థానంలో జూనియర్లను నియమించుకుంటున్నాయి. ఏడాదికి రూ.15 లక్షల ప్యాకేజీ దాటితే కత్తివేలాడుతున్నట్లే. వారిస్థానంలో జూనియర్‌ ఐటీ నిపుణులను నియమించుకుంటున్నారు. ప్రస్తుతం కంపెనీలు జూనియర్లకు వేతనంగా రూ.1.8 - 2.4 లక్షల వరకు చెల్లిస్తున్నాయి. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు గరిష్ఠంగా ఏడాదికి రూ.3లక్షలు ఇస్తున్నాయి. దీంతో వారి స్థానంలో జూనియర్లను నియమించుకుంటున్నాయి. తద్వారా అదనంగా ఉద్యోగాలు కల్పించామని రికార్డు చేస్తున్నాయి.

అందుకే స్వచ్ఛందంగా..

ఐటీ కంపెనీల్లో కార్మిక చట్టాల అమలు కాగితాలపైనే ఉంటోంది. ఉద్యోగులు ఫిర్యాదు చేయకపోవడంతో ప్రభుత్వ నియంత్రణ లేకుండా పోయింది. కంపెనీతో గొడవపడితే, ఆ ప్రభావం తదుపరి వచ్చే ఉద్యోగంపై ఉంటుందన్న భావనతో నిపుణులు ముందుకు రావడం లేదు. దీంతో తొలగింపు నిర్ణయం జరగ్గానే స్వచ్ఛందంగా బయటకు వెళ్తున్నారు. ఐటీ కంపెనీలు తేలికగా కార్మిక చట్టాల బారి నుంచి తప్పించుకుంటున్నాయి. స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలి పెట్టినపుడు కనీస పరిహారం ఇవ్వడం లేదు. కేవలం రెండు నెలల వేతనం చేతిలో పెట్టి పంపిస్తున్నాయి.

తొలగించేందుకు కారణాలు అనేకం..

* ప్రాజెక్టు లాగిన్‌.. లాగవుట్‌ సమయం

* ఏడాది కాలంలో అతని పనితీరు, గ్రేడింగ్‌ మదింపు

* వివిధ అంశాల్లో చూపించిన ప్రతిభ, పొరపాట్లు

* క్యాబిన్‌లో ఉన్న సమయం.. బయట ఉన్న సమయం

* ఉద్యోగిపై ఎన్నిఫిర్యాదులు వచ్చాయి.. ఆ ఫిర్యాదులు ఏ స్థాయి వరకు వెళ్లాయి.

* ఈ కారణాల విశ్లేషణ అనంతరం ఉద్యోగిని బెంచ్‌లో పెడుతారు.

* ఆ వెంటనే తదుపరి ప్రాజెక్టులో స్థానం లభించకుంటే ఇంటికి పంపిస్తారు.

* ఇవేమీ లేకుండా నేరుగా డీ గ్రేడు ఇచ్చి బయటకు పంపిస్తున్న ఘటనలు ఉన్నాయి.

ఏ సమస్య వచ్చినా సంప్రదించాలి

గతంలోనూ ఇలాంటి తొలగింపులు జరిగినపుడు ఫోరం ఫర్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ అడ్డుపడింది. కార్మికశాఖ ముందు పిటిషన్లు దాఖలు చేసి పలువురు ఉద్యోగులను తిరిగి కంపెనీల్లోకి పంపించే ప్రయత్నం చేశాం. పరిహారం కింద ఆరునెలల వేతనం ఇప్పించాం. లాభాలు ఉన్నంత కాలం ఐటీ ఉద్యోగులను తొలగించడానికి చట్టాలు ఒప్పుకోవు. హైదరాబాద్‌లో కంపెనీలు బలవంతపు తొలగింపులకు ప్రయత్నిస్తే నేరుగా సంస్థను సంప్రదిస్తే అవసరమైన సహాయం అందిస్తాం.

- కిరణ్‌చంద్ర, ఫోరం ఫర్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌

కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలి

ఐటీ సంస్థల్లో ప్రతియేటా తొలగింపులు జరుగుతుంటాయి. ఉద్యోగులు ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీపై దృష్టిసారించాలి. సీనియర్లు కొత్త టెక్నాలజీ నైపుణ్యాలు నేర్చుకుంటే సమస్య నుంచి వేగంగా బయటపడవచ్చు. మార్కెట్‌ అవసరాలకు తగిన సరైన టెక్నాలజీ ఎంచుకోవాలి. యువత నూతన ఆవిష్కరణలను ప్రభుత్వం ప్రోత్సహించి, అవసరమైన ఆర్థిక సహాయం అందించాలి.

- సందీప్‌కుమార్‌, తెలంగాణ ఐటీ అసోసియేషన్‌

ఇదీ చూడండి:భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం కసరత్తు!

ABOUT THE AUTHOR

...view details