Tesla posts record profit: ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా.. నాలుగో త్రైమాసికంలో భారీ లాభాన్ని వెనకేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆటో పరిశ్రమపై చిప్ కొరత తీవ్ర ప్రభావం చూపినప్పటికీ.. టెస్లా మాత్రం పెద్ద సంఖ్యలో విద్యుత్ వాహనాలను విక్రయించింది. ఫలితంగా 2021 ఏడాదిలో 5.5 బిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని సంపాదించింది. నాలుగో త్రైమాసికంలోనే 2.32 బిలియన్ డాలర్లను వెనకేసుకుంది. 2020లో సంస్థ 3.47 బిలియన్ డాలర్ల లాభాన్ని సంపాదించింది.
Tesla Profit 2021:
2021 ఏడాదిలో మొత్తం 9,36,000 వాహనాలను టెస్లా విక్రయించింది. ఇది 2020తో పోలిస్తే రెట్టింపు. 2021 నాలుగో త్రైమాసికంలోనే సంస్థ 3,08,600 వాహనాలను అమ్మింది.
కొత్త మోడళ్లు లేనట్టే..
Tesla Yearly profit: వార్షిక లాభంలో గణనీయ వృద్ధి కారణంగా టెస్లా లాభాదాయ సంస్థగా మారిందని కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. గతేడాది కంటే 2022లో 50 శాతం అధికంగా వాహనాలను ఉత్పత్తి చేస్తామని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే, చిప్‌ల కొరత కారణంగా ఈ ఏడాది కొత్త మోడల్ కార్లను అందుబాటులోకి తీసుకురావడం లేదని వెల్లడించారు.