అమెరికాకు చెందిన దిగ్గజ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ టెస్లాకు చైనాలో చిక్కులు తప్పడం లేదు. ఇటీవలే టెస్లాపై గూఢచర్యం ఆరోపణలు చేసిన చైనా అధికారులు.. తాజాగా ఆ కంపెనీని ఇరకాటంలో పెట్టే మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో టెస్లా కార్లను పార్క్ చేసేందుకు అనుమతి నిరాకరించాలని అధికారులు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీజింగ్, షాంఘై నగరాల్లో పలు ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో.. ఇప్పటికే టెస్లా కార్లను నిలపకుండా ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం.
టెస్లా కార్లను గూఢచర్యానికి ఉపయోగించినట్లు తేలితే తమ కంపెనీని శాశ్వతంగా మూసివేస్తామని సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చైనా ప్రభుత్వానికి గతంలో హామీ ఇచ్చారు. అయినప్పటికీ.. చైనా ప్రభుత్వం మాత్రం టెస్లాపై ఇంకా అనుమానంగానే ఉన్నట్లు ఈ విషయం స్పష్టం చేస్తోంది.
చైనా ఆరోపణలు ఇవే..
టెస్లా కార్లలో అమర్చిన సీక్రెట్ కెమెరాలతో కంపెనీ గూఢచర్యానికి పాల్పడుతోందనేది చైనా ప్రధాన ఆరోపణ. హై సెక్యూరిటీ జోన్లు అయిన మిలిటరీ కాంప్లెక్స్లవంటి ప్రాంతాల నుంచి సున్నితమైన సమాచారాన్ని తెసుకుంటోందని చైనా అనుమానిస్తోంది.