జియో మార్కెట్లోకి ప్రవేశించిన తర్వత దాదాపు అన్ని టెలికాం సంస్థలు వాటి టారీఫ్‌లు మార్చుకున్నాయి. అప్పటి వరకు ఉన్న డేటా ఛార్జీల మోత తగ్గింది. కొన్ని రోజుల వరకు కాలింగ్, డేటా ఛార్జీల్లో ప్రత్యేక తగ్గింపుతో పోటాపోటీ ఆఫర్లు ప్రకటించాయి టెలికాం సంస్థలు. ఇప్పుడు ఈ విధానాన్ని పక్కన పెట్టి సరికొత్త పద్ధతిలో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా వంటి దిగ్గజాలు ఉచితంగా సినిమాలు, లైవ్ టీవీ, వెబ్ సీరిస్‌లు చూసేందుకు అవకాశమిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సహా ఇతర వీడియో ఆన్ డిమాండ్ సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
జియో టీవీ, జియో సినిమా..
సబ్‌స్క్రిప్షన్‌తో పాటే.. వీడియోలు, సినిమాలు ఉచితంగా చూసే సంప్రదాయాన్ని మొదటగా పరిచయం చేసింది రిలయన్స్ జియో అనే చెప్పాలి. మార్కెట్లోకి ప్రవేశించిన వెంటనే జియో యాప్‌ల సందడి మొదలైంది. అన్ని రకాల అవసరాలకు యాప్‌లు అందుబాటులోకి తెచ్చింది ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో.
వాటిలో జియో టీవీ యాప్.. లైవ్ టీవీ ఛానెళ్లను చూసే వీలు కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 600 వరకు ఛానళ్లు జియో టీవీలో అందుబాటులో ఉన్నాయి.
జియో సినిమా యాప్ ద్వారా డిస్నీ సహా మరెన్నో నిర్మాణ సంస్థల సినిమాలను ఉచితంగా చూసే వీలుంది. వీటితో పాటు సంగీత ప్రియులకు 'జియో సావన్' ద్వారా లక్షలాది పాటలు అందుబాటులో ఉన్నాయి.
వొడాఫోన్-ఐడియా ఆఫర్లు ఇవే..
వొడాఫోన్-ఐడియా సంయుక్తంగా ఉన్నా.. వాటి నుంచి రెండు వేర్వేరు వీడియో ఆన్ డిమాండ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 'వొడాఫోన్ ప్లే' యాప్ ద్వారా వినియోగదారులు ఎంచుకునే వీడియోలను చూసే వీలుంది. జీ5, ఏఎల్టీ బాలాజీ సంస్థల ప్రీమియం వీడియోలనూ వొడాఫోన్ ద్వారా పొందొచ్చు.
ఐడియా మూవీస్, ఐడియా టీవీ యాప్‌ల ద్వారా సినిమాలు, లైవ్ టీవీ చూసే వీలుంది. వీటితో పాటు సోనీ లైవ్, జీ5, సన్నెక్స్ట్, షిమరో మీ, హోయ్కోయ్, ఎరోస్ నవ్, హంగామా వంటి ఓటీటీ సంస్థల వీడియోలను ఐడియా అందిస్తోంది.
జియో తర్వాత ఎయిర్టెల్ ఫేవరెట్
వినోదానికి పెద్ద పీట వేస్తూ జియో అందిస్తోన్న.. ఆఫర్లకు పోటీ ఇస్తున్న ఏకైక సంస్థ ఎయిర్టెల్ అనే చెప్పాలి. పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులందరికీ వీడియో ఆన్ డిమాండ్ ఆఫర్లు అందిస్తోంది ఎయిర్టెల్. దాదాపు అన్ని ప్లాన్లకు అదనంగా 'ఎయిర్టెల్ టీవీ' ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఇస్తోంది. ఎయిర్టెల్ టీవీలోనూ జియో టీవీలానే... 10,000కు పైగా సినిమాలు, టీవీ షోలు అందుబాటులో ఉన్నాయి. ఎరోస్ నవ్, ఏఎల్టీ బాలాజీ, హంగామా సహా పలు ఇతర సంస్థల వీడియోలను ఎయిర్టెల్ యూజర్లు చూడొచ్చు.
ఎయిర్‌టెల్‌కు చెందిన వింక్ మ్యూజిక్ ద్వారా పాటలు స్ట్రీమ్ చేసేందుకు, వింక్ ట్యూబ్ ద్వారా వీడియోలు చూసేందుకు వీలుంది. కొన్ని ప్రత్యేక ప్యాకేజీల్లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్లను అందిస్తోంది ఎయిర్టెల్.
ఇదీ చూడండి: 600మంది ఉద్యోగులకు బలవంతపు సెలవు