తెలంగాణ

telangana

ETV Bharat / business

కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఇక ఉమ్మడి పరీక్ష! - టీసీఎస్ కార్పోరేట్ పరీక్ష

టీసీఎస్​లోకి ఉద్యోగుల ఎంపికకు నిర్వహించే ఎన్​క్యూటీ పరీక్షను ఇతర కార్పొరేట్ సంస్థలకూ అందుబాటులోకి తెచ్చింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. కార్పొరేట్ కంపెనీల్లో చేరే వారికి కామన్ గేట్​వేలా ఈ పరీక్ష ఉంటుందని టీసీఎస్ అభిప్రాయపడింది. ఈ నియామక విధానంలో పెద్ద సంస్థలతో పాటు చిన్న వ్యాపారాలను అనుసంధానించుకుంటున్నట్లు తెలిపింది.

TCS opens National Qualifier Test to corporates for recruiting freshers
ఇక అన్ని కార్పొరేట్ సంస్థలకు టీసీఎస్ పరీక్ష

By

Published : Sep 27, 2020, 2:43 PM IST

టీసీఎస్​ కంపెనీలోకి ఉద్యోగులను ఎంపిక చేసేందుకు నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష(నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్-ఎన్​క్యూటీ)ను ఇతర కార్పొరేట్ సంస్థల నియమకాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు దిగ్గజ ఐటీ సంస్థలు ముందుకొస్తున్నట్లు తెలిపింది. గతేడాది వరకు టీసీఎస్ ఉద్యోగుల ఎంపిక వరకే ఈ పరీక్షను పరిమితం చేసింది.

"కార్పొరేట్లకు కొత్త నియామక కార్యక్రమాలలో ఎన్​క్యూటీ కామన్ గేట్​వేలా పనిచేస్తుంది. వివిధ కార్పొరేట్ సంస్థలు అందించే ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులకు ఈ ప్రామాణిక పరీక్ష అవకాశం కల్పిస్తుంది. కార్పొరేట్ సంస్థలకు అవసరమయ్యే అభ్యర్థుల సామర్థ్యాలను ఈ పరీక్ష ద్వారా అంచనా వేయవచ్చు."

-వెంగుస్వామి రామస్వామి, టీసీఎస్ ఐయాన్ గ్లోబల్ హెడ్

ఈ నియామక ప్రక్రియలో భాగస్వామ్యం కోసం క్రోమా, టైటాన్, కిర్లోస్కార్, గోద్రెజ్ వంటి ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయని రామస్వామి తెలిపారు. వీటితో పాటు చిన్న సంస్థలనూ అనుసంధానించుకుంటున్నట్లు తెలిపారు. దేశంలోని 600 నగరాల్లో పలు వ్యాపారాలతో చర్చలు జరుపుతున్నామని.. ఎన్​క్యూటీ స్కోరు ఆధారంగా వీరు కూడా అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చని అన్నారు.

ఈ పరీక్షలో ఏం ఉంటుంది?

ఎన్​క్యూటీలో అభ్యర్థి వెర్బల్ ఎబిలిటీస్, న్యూమరికల్ ఎబిలిటీస్, రీజనింగ్ సహా ఇతర జనరల్ ఎబిలిటీస్​ను పరీక్షిస్తారు. ఐటీ వర్గాల కోసం ప్రోగ్రామింగ్​పైనా పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది.

ఎవరు రాయొచ్చు?

డిగ్రీ పూర్తయిన విద్యార్థులు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో అభ్యర్థులు ఇంటి నుంచే పరీక్ష రాసే అవకాశాన్ని టీసీఎస్ ఐయాన్ కల్పిస్తోంది. ఇంట్లో వద్దనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న 600 టీసీఎస్ ఐయాన్ సెంటర్లలో పరీక్ష రాయొచ్చు.

వచ్చే నెలలోనే పరీక్ష

ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పరీక్ష నిర్వహిస్తారు. వచ్చిన మార్కులు రెండేళ్ల వరకు చెల్లుబాటు అవుతాయి. మొదటిసారి పరీక్షను ఉచితంగానే రాయవచ్చు. అక్టోబర్ 17 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబర్ 24-26 మధ్య పరీక్ష నిర్వహణ ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details