Tax Savings: ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా ఎంతో కీలకం. దీనికోసం అందుబాటులో అనేక పథకాలున్నప్పటికీ.. స్టాక్ మార్కెట్లో మదుపు చేయడం ద్వారా పన్ను భారం తగ్గించుకునే వెసులుబాటునిచ్చేవి ఈఎల్‌ఎస్‌ఎస్‌లు (ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు). ఆర్థిక లక్ష్యాల సాధనకూ ఇవి తోడ్పడతాయి.
పన్ను ప్రణాళిక ఆర్థిక సంవత్సరం తొలి నెల నుంచే ప్రారంభం కావాలి. అయినప్పటికీ చాలామంది జనవరి తర్వాతే దీని గురించి ఆలోచిస్తుంటారు. ఈ సమయంలోనూ పూర్తి అవగాహనతో సరైన పథకాన్ని ఎంచుకుంటే.. దీర్ఘకాలిక ప్రయోజనం పొందడం కష్టమేమీ కాదు.
ఇతర పథకాలతో పోలిస్తే ఉన్న విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈఎల్‌ఎస్‌ఎస్‌లు మదుపరుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం ఇందులో పెట్టిన పెట్టుబడికి పన్ను మినహాయింపు లభిస్తుంది. రూ.1,50,000 పరిమితికి లోబడి అనేది గుర్తుంచుకోవాలి. ఇవి సాధారణ మ్యూచువల్ ఫండ్ పథకాలను పోలి ఉన్నప్పటికీ.. మదుపును కనీసం మూడేళ్లపాటు కొనసాగించాలనే నిబంధన ఉండటం, పెట్టిన పెట్టుబడికి పన్ను మినహాయింపు లభించడం ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ఇందులోనూ గ్రోత్, డివిడెండ్, డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్ ఐచ్ఛికాలున్నాయి.
ఒకేసారి మదుపు చేసేందుకూ, క్రమానుగత విధానంలో పెట్టుబడి పెట్టేందుకూ ఈ పథకాలు అవకాశాన్నిస్తాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌లు ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో మదుపు చేస్తాయి. ఈక్విటీల్లో ఏడాదికి మించి పెట్టుబడులను కొనసాగించినప్పుడు.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి రాబడి వస్తే.. ఆ పై మొత్తానికి 10 శాతం పన్ను చెల్లించాలి. ఈఎల్‌ఎస్‌ఎస్‌లకూ ఇది వర్తిస్తుంది.