కార్ల కొనుగోలుదారులకు మరో సంస్థ షాక్ ఇచ్చింది. మారుతీ సుజుకి ఇండియా దారిలోనే.. 2020 జనవరి నుంచి తమ వాహనాల ధరలు పెంచుతున్నట్లు కార్ల తయారీ సంస్థ టాటా మోటర్స్ ప్రకటించింది. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తమ వాహనాలను మార్చే క్రమంలో సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉన్నందును ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం ఈ సంస్థ రూ.4.39 లక్షల నుంచి రూ.16.85 లక్షలు(దిల్లీ ఎక్స్ షోరూం ధర) శ్రేణిలోని హ్యాచ్బ్యాక్ టియాగో నుంచి ఎస్యూవీ హారియెర్ వాహనాలను విక్రయిస్తోంది.
"బీఎస్-6 వాహనాలు అందుబాటులోకి వస్తే జనవరి నుంచి ధరలు పెరుగుతాయి. మేము ధరల పెంపు నిర్ణయంపై అన్ని విధాలా చర్చిస్తున్నాం. సాధారణంగా ఏదైనా మార్పు జరిగినప్పుడు వాహనాల రేట్లలో సుమారు రూ.10-15 వేల వరకు పెరుగుదల ఉంటుంది. ఇప్పుడు రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి బీఎస్-6, మరొకటి వస్తువుల ధరల పెరుగుదల ఒత్తిడి కూడా ఉంది. "
- మయాంక్ పరీక్, టాటా మోటర్స్ అధ్యక్షుడు (ప్రయాణ వాహనాల విభాగం)
ప్రస్తుతం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంస్థ.. రేట్లలో ఎంత మేర పెంపు ఉంటుందనే విషయాన్ని వెల్లడించలేదు.