Tata Car Price Hike: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్ వాహనాల ధరలను 0.9 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జనవరి 19న అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. జనవరి 18కి ముందు ఆర్డర్లకు ఈ పెంపు వర్తించదని పేర్కొంది.
కమొడిటీలు, ముడి పదార్థాల ధరలు పెరిగినందువల్ల కంపెనీపై అదనపు భారం పడుతోందని, ఫలితంగా ధరలు పెంచాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో తెలిపింది.
ముంబయికి చెందిన ఈ కార్ల తయారీ సంస్థ టియాగో, పంచ్, హారియర్ వంటి మోడళ్లను దేశీయ విపణిలో విక్రయిస్తుంది.
''2022 జనవరి 19న పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయి. వేరియంట్లు, మోడళ్లను బట్టి ఈ ధరల పెంపు ఉంటుంది.''
- టాటా మోటార్స్
ఇదే సమయంలో టాటా మోటార్స్ తమ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. కొన్ని వేరియంట్లకు ప్రత్యేక ఆఫర్ కింద రూ. 10 వేల తగ్గింపు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.