తెలంగాణ

telangana

ETV Bharat / business

AirIndia: 'ఎయిర్​ ఇండియా'.. ఆయన కలలకు రెక్కలు - tata air india bid

దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తిరిగి తన పుట్టింటికి చేరుకుంటోంది విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా (air india news). ఈ అపురూప క్షణాల కోసం(tata air india history) టాటా గ్రూప్‌ వేయి కళ్లతో ఎదురుచూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును మరి.. 89ఏళ్ల కిందట వారు స్థాపించిన ఈ కంపెనీ.. 68ఏళ్లు తమకు దూరంగా ప్రభుత్వం చేతిలో ఉంది. మళ్లీ ఇన్నాళ్లకు పూర్తిగా టాటాల అధీనంలోకి వెళ్లబోతోంది. ఇంతకీ విమానయాన సంస్థను ప్రారంభించాలన్న ఆలోచన టాటాలకు ఎలా వచ్చింది..? ఎయిర్​ ఇండియా ఎలా పుట్టింది..?

air india
ఎయిర్​ ఇండియా

By

Published : Oct 9, 2021, 5:36 PM IST

టాటాల కుటుంబానికి(tata air india) చెందిన జహంగీర్‌ రతన్‌జీ దాదాభోయ్‌(జేఆర్‌డీ) టాటా తల్లి సుజన్నె సూని బ్రియెర్‌ ఫ్రాన్స్‌ దేశస్థురాలు. దీంతో జేఆర్‌డీ టాటా తన బాల్యంలో చాలా కాలం ఆ దేశంలోనే గడిపారు. వీరి ఇల్లు లూయిస్‌ బ్లెరియట్‌ ఇంటి పక్కనే ఉండేది. ఇంగ్లిష్‌ ఛానల్‌పై విమాన ప్రయాణం చేసిన తొలి వ్యక్తిగా లూయిస్‌ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. 1907లో ఓ మోనోప్లేన్‌లో ఈ ప్రయాణం చేశారు. లూయిస్‌ కుమారుడి ద్వారా ఈ విషయం తెలుసుకున్న జేఆర్‌డీ టాటా ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందారు. ఆ తర్వాత 1927లో అట్లాంటిక్‌ మీదుగా సోలో విమాన ప్రయాణం చేసిన ఛార్లెస్‌ లిండ్‌బెర్గ్ గురించి తెలుసుకుని టాటా(tata air india history) ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఈ రెండు సంఘటనలు ఆయనలో కొత్త ఆలోచనకు బీజం వేశాయి. ఎగరాలనే తన కలలకు మూలం ఇవే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

జేఆర్​డీ టాటా

రూ.2లక్షల పెట్టుబడితో..

తల్లి మరణం తర్వాత 1923లో జేఆర్‌డీ టాటా కుటుంబంతో కలిసి భారత్‌కు తిరిగొచ్చారు. అయితే ఆయనలో ఎగరాలనే కాంక్ష మాత్రం నానాటికీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే 1929లో ముంబయి(అప్పటి బొంబాయి)లో తొలి ఫ్లయింగ్‌ క్లబ్‌ ప్రారంభమైంది. దీంతో జేఆర్‌డీ టాటా అందులో చేరి విమానయానంలో శిక్షణ తీసుకున్నారు. విమానం నడపడంలో మెళకువలు తెలుసుకునేందుకు ఎక్కువ గంటలు క్లబ్‌లోనే ఉండేవారట. అలా మూడేళ్ల తర్వాత 1932లో 'టాటా ఎయిర్‌ సర్వీసెస్‌' పేరుతో జేఆర్‌డీ టాటా విమానయాన సంస్థను ప్రారంభించారు. ఇందుకు రూ.2లక్షలు పెట్టుబడి పెట్టారు. 'టాటా ఎయిర్‌ మెయిల్‌' పేరుతో కరాచీ నుంచి బొంబాయికి తొలి విమానాన్ని ప్రారంభించారు. దీన్ని నడిపింది కూడా జేఆర్‌డీ టాటానే కావడం విశేషం. భారత్‌లో దేశీయ పైలట్‌గా లైసెన్సు తీసుకున్న తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం మరో ప్రత్యేకం.

జేఆర్​డీ టాటా

ఎయిర్​ ఇండియాగా నామకరణం..

తొలుత కార్గో సేవలను మాత్రమే అందించిన ఈ సంస్థ తర్వాతి కాలంలో పౌరవిమానయానంలోకి అడుగుపెట్టింది. కేవలం ఐదేళ్లలోనే టాటా ఎయిర్‌ సర్వీసెస్‌ లాభం రూ.60వేల నుంచి రూ.6లక్షలకు పెరిగింది. 1938లో ఈ సంస్థ పేరును 'టాటా ఎయిర్‌లైన్స్‌'గా మార్చారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో టాటా ఎయిర్‌లైన్స్‌ విమానాలను బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇదే సమయంలో టాటాలకు ప్రభుత్వంతో విభేదాలు మొదలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎయిర్‌లైన్స్ తిరిగి టాటా నియంత్రణలోకి వెళ్లింది. ఆ తర్వాత 1946లో దీనికి 'ఎయిర్​ ఇండియా'గా నామకరణం చేశారు. అదే సమయంలో జాయింట్‌ స్టాక్ కంపెనీగా పబ్లిక్‌లోకి వచ్చింది.

అంతర్జాతీయ సేవల కోసం..

స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం, టాటాల మధ్య విభేదాలు కాస్త సద్దుమణిగాయి. అప్పుడే అంతర్జాతీయ సేవలను మొదలుపెట్టాలని జేఆర్‌డీ టాటా భావించారు. ఇందుకోసం ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. ఎయిర్​ ఇండియాలో 49శాతం వాటాను ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించారు. దీనికి అప్పటి నెహ్రూ ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపడంతో ఎయిర్​ ఇండియా బొంబాయి- లండన్‌ మధ్య తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును నడిపింది. అప్పటికీ సంస్థలో టాటాల వాటా 25శాతంగా ఉండగా.. మిగతాది షేర్ల రూపంలో పబ్లిక్‌లో ఉంది.

ఎయిర్​ ఇండియా

రూ.2.8కోట్లకు ప్రభుత్వానికి ఇచ్చేసి..

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న విమానయాన రంగాన్ని ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలని భావించింది. ఇందుకోసం 1946 నుంచే చర్చలు చేపట్టింది. అయితే తొలుత ఇందుకు జేఆర్‌డీ టాటా ఆసక్తి కనబర్చలేదు. కానీ ఆ తర్వాత నెహ్రూ ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో టాటా అంగీకరించక తప్పలేదు. దీంతో 1953లో ఎయిర్​ ఇండియాను జాతికి అంకితం చేశారు. అప్పటికి సంస్థలో 49శాతం వాటా కేంద్రానికి ఉండగా.. మరో రూ.2.8కోట్లు ఇచ్చి ఎయిర్​ ఇండియాలో మొత్తం వాటాను ప్రభుత్వం కొనుగోలు చేసింది.

ఆ విమాన ప్రమాదం మార్చేసింది..

ఎయిర్​ ఇండియాను జాతికి అంకితం చేసినప్పటికీ.. చాలా ఏళ్ల పాటు సంస్థ నియంత్రణ టాటాల చేతుల్లోనే ఉంది. జేఆర్‌డీ టాటా 25ఏళ్లకు పైగా సంస్థ ఛైర్మన్‌గా సేవలందించారు. అయితే 1978లో జరిగిన ఓ విమాన ప్రమాదం అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎయిర్​ ఇండియాకు చెందిన తొలి బోయిగ్ విమానం ఆ ఏడాది ముంబయి తీరంలోని అరేబియా సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 213 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే టాటాలపై గుర్రుగా ఉన్న మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం.. ప్రమాదం జరిగిన నెల రోజులకే జేఆర్‌డీ టాటాను ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత 1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేఆర్‌డీ టాటాను ఎయిర్​ ఇండియా డైరెక్టర్ల బోర్డులోకి తీసుకున్నారు. 1986వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ హయాంలో రతన్‌ టాటా ఎయిర్​ ఇండియా ఛైర్మన్‌గా నియమితులై 1989 వరకు కొనసాగారు. ఆ తర్వాత నుంచి టాటాలు ఎయిర్​ ఇండియాలో జోక్యం చేసుకోకుండా పూర్తిగా సంస్థకు దూరమయ్యారు.

టాటా విమనం

'విస్తారా'తో మళ్లీ ఎయిర్‌లైన్‌ వ్యాపారంలోకి..

అయితే విమానయాన రంగంలో కొనసాగాలనే ఆశ మాత్రం టాటాలు వదులుకోలేదు. 1990ల్లో ప్రభుత్వం ఎయిర్‌లైన్‌ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రైవేటు సంస్థలను విమానయానంలోకి అనుమతించింది. దీంతో టాటాల్లో మళ్లీ ఎయిర్‌లైన్ ఆశ చిగురించింది. దీంతో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ప్రారంభించేందుకు చర్చలు జరిపారు. అలా 2012లో 'విస్తారా' పేరుతో మళ్లీ దేశీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు ఎయిర్‌లైన్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు.

కన్నబిడ్డ కష్టాలను చూడలేక..

అయితే 1990ల్లో ప్రైవేటు సంస్థలు విమానయాన రంగంలోకి అడుగుపెట్టడంతో ఎయిర్​ ఇండియా క్రమంగా తన ప్రభను కోల్పోతూ వచ్చింది. 2008 తర్వాత మరింత కష్టాల్లో కూరుకుపోయింది. అప్పులు గుట్టలుగా పెరిగిపోయాయి. దీంతో ప్రైవేటీకరించడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం కన్పించలేదు. పెట్టుబడుల ఉపసంహరణ కోసం కేంద్రం బిడ్డింగ్‌ యత్నాలు మొదలుపెట్టింది. తాము స్థాపించిన సంస్థ కష్టాల్లో ఉండటం చూడలేని టాటా గ్రూప్‌.. వెంటనే బిడ్డింగ్‌ చర్యలు ప్రారంభించింది. సంస్థను తిరిగి దక్కించుకునేందుకు దూకుడుగా ముందుకు వెళ్లింది. చివరకు తమ ప్రయత్నాలు ఫలించి.. ఎయిర్​ ఇండియాలో 100శాతం వాటాను తిరిగి దక్కించుకుంది. నాడు రూ.2.8కోట్లకు ప్రభుత్వానికి విక్రయించిన టాటాలే.. ఇప్పుడు తిరిగి రూ.18వేల కోట్లు వెచ్చించి ఎయిర్​ ఇండియాను దక్కించుకోవడం విశేషం.

నష్టాలకు ప్రధాన కారణం..

ఎయిర్​ ఇండియాకు ప్రధానంగా మధ్యప్రాశ్చ్య దేశాలకు నడిపే విమాన సర్వీసులు లాభదాయకంగా ఉండేవి. ప్రత్యేకించి గల్ఫ్‌ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, కతర్‌, బహ్రెయిన్‌ తదితర దేశాలకు ఎక్కువ సర్వీసులు నడిపేది. ఈ దేశాల్లో ప్రవాస భారతీయులు లక్షల్లో ఉండటంతో ఎక్కువగా రాకపోకలు సాగించేవారు. అయితే యూపీఏ హయాంలో ఎయిర్​ ఇండియాతో పాటు ఇతర ప్రైవేటు సంస్థలకు కూడా ఈ మార్గాల్లో అనుమతులిచ్చారు. దీంతో గుత్తాధిపత్యం పోవడంతో సంస్థ క్రమంగా నష్టాల్లో కూరుకుపోయింది.

ఇదీ చూడండి:-68ఏళ్ల తర్వాత సొంత గూటికి ఎయిర్​ ఇండియా

ABOUT THE AUTHOR

...view details