ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే ఏం చేస్తాం? వంటల విషయానికి వస్తే పుస్తకాలు ఉన్నాయి. టీవీల్లో అభిరుచి లాంటి కార్యక్రమాలు వస్తాయి. ఇంటర్నెట్ విస్తృతి పెరిగినప్పటి నుంచి యూట్యూబ్ ఇందుకు వేదికగా మారింది.
ఎలా చేయాలి? మీకు మీరుగా నేర్చుకోండి(డూ ఇట్ యువర్సెల్ఫ్-డీఐవై), వంటలకు సంబంధించి ఎన్నో వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయి. అయితే కొన్ని కోట్ల వీడియోల్లో మనకు కావాల్సింది వెతకడం కష్టమైన పని. అంతేకాకుండా ఆ వీడియోల నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది.
సరికొత్త యాప్..
ఈ సమస్యకు పరిష్కారం చూపెడుతూ సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది గూగుల్. అదే 'టంజీ' (TeAch aNd GIve). వంటకాలు, డీఐవై, ఫ్యాషన్-సౌందర్య చిట్కాలు, కళలు, లైఫ్‌స్టైల్‌కు సంబంధించి ఎంపిక చేసిన వీడియోలను యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది ఈ దిగ్గజ సంస్థ.