ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ టీ-సిరీస్ అరుదైన ఘనత సాధించింది. సంగీతం, సినీ నిర్మాణ రంగాల్లో వెలుగొందుతున్న ఈ సంస్థ.. యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్స్ కలిగిన ఛానల్‌గా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల(పది కోట్ల)కు పైగా సబ్‌స్క్రైబర్స్ కలిగిన ఏకైక సంస్థగా టీ- సిరీస్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
గిన్నీస్ ప్రతినిధి రిషినాథ్ చేతుల మీదగా టీ-సిరీస్ యజమాని భూషణ్ కుమార్ రికార్డు ధ్రువపత్రాన్ని అందుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా..
టీ-సిరీస్‌కు భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బ్రిటన్, అమెరికా, ఐరోపా, పశ్చిమాసియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా చాలా దేశాల్లో టీ-సిరీస్ సంగీత ప్రియుల్ని ముగ్ధులను చేస్తోంది.
2011 జనవరిలో ప్రారంభించిన టీ-సిరీస్ ఛానల్‌కు మొత్తం 29 ఉపఛానళ్లు ఉన్నాయి. ఏడాదిన్నర కాలంలో నెటిజన్లు అత్యధికంగా వీక్షించిన ఛానల్ ఇదే కావటం విశేషం.