తెలంగాణ

telangana

ETV Bharat / business

వ్యాపార దిగ్గజం టాటాకు 27 ఏళ్ల కుర్రాడితో స్నేహం!

పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్​ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు ఇప్పుడు 82 ఏళ్లు. ఆయన మిత్రులు అనగానే ఏ వ్యాపారవేత్తలో, ఇంకెవరో అనో ఊహించుకుంటాం. కానీ.. 27 ఏళ్ల ఓ కుర్రాడికి, టాటాతో మంచి అనుబంధం ఉంది. వ్యాపార దిగ్గజానికే సలహాలిచ్చే స్థాయికి ఎదిగాడా వ్యక్తి. ఎగ్జిక్యూటివ్​ అసిస్టెంట్​గా కొనసాగుతూ.. స్టార్టప్​ ఇన్వెస్ట్​మెంట్​లలో తన సహకారమందిస్తున్నాడు. ఇంతకీ టాటా మెచ్చిన ఆ కుర్రాడు ఎవరు? ఇరువురికీ పరిచయం ఎలా ఏర్పడింది?

Story Of A 27-Year-Old Boy Who Got Himself A dream Job With Ratan Tata
టాటాకే సలహాలిస్తున్న 27 ఏళ్లు కుర్రాడు!

By

Published : Jun 6, 2020, 8:38 AM IST

వ్యాపార దిగ్గజం టాటాకు 27 ఏళ్ల కుర్రాడితో స్నేహం!

ఎవరు చెప్పారు మనిషి... జీవితంలో తొందరగా పైకి రాలేడని. ఈ 27 ఏళ్ల ఎంబీఏ పట్టభద్రుడికి అదేమీ కష్టమనిపించలేదు. అమెరికాలోని ప్రఖ్యాత కార్నెల్​ యూనివర్సిటీలో చదివిన శాంతను నాయుడు.. చాలా చిన్న వయసులోనే వ్యక్తిగతంగా పెద్ద విజయం​ సాధించాడు. దేశంలోని అగ్ర వ్యాపారవేత్త, ఫిలాంత్రపిస్ట్​ రతన్​ టాటా కంపెనీలో గౌరవనీయ హోదాలో ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా వ్యాపార దిగ్గజం టాటాకే తన వినూత్న ఆలోచనలతో.. సలహాలిచ్చే స్థాయికి ఎదిగాడు. టాటాలో.. ఎగ్జిక్యూటివ్​ అసిస్టెంట్​గా సేవలందిస్తున్నాడు. వీరిద్దరికి మంచి దోస్తీ ఉంది.

టాటాతో కలిసి పనిచేయడం గురించి శాంతను నాయుడును అడిగితే.. అలాంటి అవకాశాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయని చెబుతాడు.

''ఇదో గొప్ప గౌరవం. రతన్​ టాటాతో కలిసి పనిచేసే అరుదైన అవకాశం.. జీవితంలో ఎప్పుడో ఓసారి మాత్రమే వస్తుంది. ఇది ప్రతి రోజు, ప్రతి క్షణం నాకు పాఠాలు నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.''

- శాంతను నాయుడు

టాటా.. ఓ దిగ్గజం...

రతన్​ టాటా గురించి.. భారత్​లో దాదాపు అందరికీ తెలుసు. దిగ్గజ వ్యాపారి, టాటా సన్స్​ కంపెనీ మాజీ ఛైర్మన్​, ఫిలాంత్రపిస్ట్​ మాత్రమే కాకుండా.. స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్​, పద్మ భూషణ్​ టాటాను వరించాయి.

సాదాసీదా జీవనం టాటా ప్రత్యేకం

మరి అంతటి దిగ్గజం టాటాతో కలిసే పనిచేసే అవకాశం శాంతనుకు ఎలా కలిగింది? అంటే... వీధి కుక్కలపై ప్రేమే.. ఇద్దరినీ కలిపిందట.

ఆ శునకాలే కారణం..!

శాంతను 2014లో పుణెలోని టాటా ఎల్​క్సీ కంపెనీలో ఆటోమొబైల్​ డిజైన్​ ఇంజినీర్​గా పనిచేసే సమయంలో.. అక్కడ ఓ సమస్య గుర్తించాడు. రాత్రివేళల్లో.. కార్లు, ఇతర వాహనాల వేగానికి వీధికుక్కలు బలైపోవడం చూసి అతని మనసు చలించిపోయింది. వాహనదారులకు చీకట్లో అవి కనిపించకపోవడమే కారణమని గ్రహించి.. శునకాలకు రాత్రిపూట మెరిసేలా మెడలో కాలర్లను ఏర్పాటుచేశాడు.

రాత్రివేళలో మెరిసే కాలర్​

ఎన్నో ప్రయత్నాల అనంతరం.. ఈ కాలర్లను రూపొందించడం విజయవంతం అయింది. ఈ ఇనిషియేటివ్​ను ఇప్పుడు మోటోపాస్​గా పిలుస్తున్నారు. ఇదే పేరుతో దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులకు ఈ మోటోపాస్​.. టాటా గ్రూప్​ దృష్టికి వచ్చింది.

తొలిసారి టాటాను కలిసినప్పుడు శాంతను

స్వతహాగా జంతుప్రేమికుడైన టాటా గురించి తెలుసుకొని.. ఆయనకు శాంతను లెటర్​ కూడా రాశాడట. తక్షణం ఎలాంటి స్పందన రాలేదు. కొద్ది రోజుల తర్వాత.. టాటాను ముంబయిలోని ఆయన కార్యాలయంలో కలవాల్సిందిగా కాల్​ వచ్చింది. అప్పుడే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. మాటలు, అభిరుచులు కలిశాయి. మోటోపాస్​పై శాంతనును తెగ మెచ్చుకున్నారు రతన్​ టాటా.

మోటోపాస్​ గురించి తెలుసుకుంటున్న రతన్​ టాటా

మంచి ప్రయత్నంలో తొలి పెట్టుబడి..

రతన్​ టాటాకు శునకాలంటే ఎంత ఇష్టమో ఈ పాటికే మీకు అర్థమయ్యుంటుంది కదా. 2018లో ముంబయిలో వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ఆ విపత్తు సమయంలో.. తన బాంబే హౌస్​ 2.0 కార్యాలయంలో వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించడం ఆయన ఉదారతకు గొప్ప ఉదాహరణ.

శునకాలపై టాటాకు అమితమైన ప్రేమ

శాంతను ఆలోచనలు, ప్రణాళికలు నచ్చి.. మోటోపాస్​లో బయట నుంచి రతన్​ టాటానే తొలి పెట్టుబడిని పెట్టడం విశేషం. ఇప్పుడీ కార్యక్రమం.. దేశంలోని 11 నగరాలకు విస్తరించింది. నేపాల్​, మలేసియా వంటి విదేశాల నుంచీ మోటోపాస్​కు ఆర్డర్లు వస్తుండటం గమనార్హం. ఆవులు, గేదెలు వంటి పెద్ద జంతువులకూ కాలర్లు రూపొందించాలని డిమాండ్లు వస్తున్నాయట.

మోటోపాస్​లో టాటా పెట్టుబడి

ప్రస్తుతం ఈ మోటోపాస్​.. నెలకు 500 నుంచి 1500 వరకు కాలర్లను తయారుచేస్తోంది. ఇంకా ఉత్పత్తిని పెంచడమే లక్ష్యమని చెబుతోంది.

రాత్రివేళలో మెరిసే కాలర్​

అంతటితో ఆగలేదు..

టాటా-శాంతను భాగస్వామ్యం మోటోపాస్​తో ఆగిపోలేదు. టాటా సలహాల కోసం.. ఎప్పుడూ కలుస్తుండేవాడు శాంతను.

శాంతను బృందం

కార్నల్​ యూనివర్సిటీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో.. శాంతను తన దృష్టిని స్టార్టప్​లు, ఇన్వెస్ట్​మెంట్​లవైపు మరల్చాడు. పారిశ్రామిక రంగంలో రాణించేందుకు సన్నద్ధత సాధించాడు.

''కార్నెల్​లో ఎంటర్​ప్రిన్యూర్​షిప్​ నాకు ఎంతో నేర్పింది. టాటా ట్రస్ట్​, కార్నెల్​ యూనివర్సిటీ పెట్​ ప్రాజెక్టులో భాగంగా ఇంటర్న్​షిప్​ చేశా. ముంబయిలో వెటర్నరీ ఆసుపత్రి నిర్మించాలన్నదే ఆ ప్రాజెక్టు. నేను డిగ్రీ పట్టా పొందకముందే నన్ను ప్రాజెక్టు బృందంలోకి తీసుకున్నారు. అలా అంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. కానీ నేను తిరిగొచ్చేసరికి పూర్తిగా మారిపోయా. నాకున్న ఆసక్తితోనే ఎంటర్​ప్రిన్యూర్​కు కావల్సిన అర్హతలు, మెళకువలు సాధించా.''

- శాంతను నాయుడు

డిగ్రీ పూర్తయిన తర్వాత.. శాంతను అదే వెటర్నరీ ప్రాజెక్టుపై పనిచేయాలనుకున్నాడు. కానీ.. టాటా తమ సంస్థలోనే చేరాలని కోరగా, అప్పటినుంచి కలిసే పనిచేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత పెరిగింది.

''టాటా చాలా తెలివైనవారు. ఆయన మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది. టాటా నిర్ణయాలు తీసుకునే సమయంలో.. ఆయన సమక్షంలో ఉండటం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. ఇంకా ఆయనలో దయాగుణం ఎక్కువే. టాటాతో కలిసి పనిచేస్తున్నట్లు మీకస్సలు అనిపించదు. ఎందుకంటే టాటాకు నేను, మీరు అనే అలాంటి అడ్డుగోడలేమీ ఉండవు. ఇతరులు ఏ పరిస్థితుల్లో ఉన్నా.. ఆయన ప్రోత్సహిస్తూనే ఉంటారు. నా ఒక్కరి గురించే కాదు.. అందరి విషయాల్లోనూ ఆయన అలాగే ఉంటారు.''

- టాటా గురించి శాంతను

శాంతను టాటా గ్రూప్​లో ఐదో తరం ఉద్యోగట. అంతకుముందు సంస్థలో పనిచేసిన ఇంజినీర్లు, టెక్నీషియన్లలో.. ఎగ్జిక్యూటివ్​ స్థాయికి ఎదగడం, టాటాతో కలిసి పనిచేయడం వంటి అవకాశాలు దక్కిన మొదటి వ్యక్తి తానేనని గర్వంగా చెప్పుకుంటాడు శాంతను.

ABOUT THE AUTHOR

...view details