స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ఠానికి చేరడం, అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి భారీగా క్షీణించడం వంటి ప్రతికూలతలున్నా మార్కెట్లు ముందుకే దూసుకుపోవడం గమనార్హం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 428 పాయింట్లు పుంజుకుంది.. చివరకు 41,010 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో తిరిగి 12,087 వద్దకు చేరింది.
లాభాలకు కారణాలివే..
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెరపడనుందన్న అంచనాలు అంతర్జాతీయంగా సానుకూలతలు పెంచాయి. 'చైనాతో అతి పెద్ద డీల్‌కు చాలా దగ్గరగా ఉన్నాం' అని ట్రంప్ ట్వీట్ చేయడం ఈ సానుకూలతలకు ప్రధాన కారణం.
బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ మరో సారి విజయం సాధించిన కారణంగా.. ఐరోపా సమాఖ్య నుంచి యూకే బయటకు రావడం ఖాయమైనట్లు అంచనాలు ఊపందుకున్నాయి. ఈ అంశాలన్నింటితో మదుపరుల సెంటిమెంట్ బలపడి కొనుగోళ్లకు మొగ్గుచూపారు.