దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్‌కు ఆవిష్కరణలు కీలకం. ఇవి సాంకేతికత పరంగా దేశాన్ని మరోస్థాయికి తీసుకెళ్లగలవు. ఈ లక్ష్య సాధనలో అంకురాలు వేగంగా కృషి చేస్తున్నాయి. ఈ ప్రయత్నానికి ప్రభుత్వ అండ తోడైతే విజయం మరింత తొందరగా చేరువవుతుందనేది అంకురాల అభిప్రాయం.
మరిన్ని సంస్కరణలు అవసరం...
ముఖ్యంగా నరేంద్ర మోదీ 1.0 ప్రభుత్వం అంకురాల కోసం స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా లాంటి పథకాలను ప్రారంభించింది. వీటితో పాటు అంకురాలు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న పన్ను సమస్య నుంచి ఎన్నికల ముందు కొంత మేర ఉపశమనం కల్పించింది కేంద్రం. అయితే మోదీ 2.0 ప్రభుత్వంలో మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమని అంకుర సంస్థల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం పన్నులు, నగదు లభ్యత సహా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహమందించాలని అంటున్నారు నిపుణులు. ఈ మేరకు కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో అంకురాలకు ఊతమందించే నిర్ణయాలు ఉండొచ్చని ఆశిస్తున్నారు.
లిస్టింగ్ ప్రక్రియ సడలించాలి...
అంకురాల్లో నిధుల ప్రవాహానికి స్టాక్ మార్కెట్‌లలో 'లిస్టింగ్' అనేది ఒక మార్గం. అయితే ఈ ప్రక్రియను అంకురాలకు సడలించాలని నిపుణులు కోరుతున్నారు. పెద్ద సంస్థలకు ఉన్న నిబంధనలను అంకురాలకు వర్తించటం సరికాదన్నది వారి విశ్లేషణ. ఇటీవల హైదరాబాద్‌లోని 25 స్టార్టప్‌ల గురించి పుస్తకాన్ని విడుదల చేసిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్త ఎన్. రాజ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"లిస్టింగ్ అర్హతను అంకురాలకు సడలించాలి. వెంచర్ క్యాపిటల్ ఫండ్ల రూపంలో పెట్టుబడులు పొందిన వాటిని అనుమతించాలి. లాభాలు ఉండాలన్న అర్హత నిబంధనను తీసివేయాలి. ప్రస్తుతం లిస్టవ్వటానికి కనీసం మూడు సంవత్సరాలు లాభాల్లో ఉండాలని నిబంధన ఉంది. ఇది తీసివేసినట్లయితే అంకురాలు లిస్టవ్వటానికి ఊతమిచ్చినవారవుతారు. ఎక్కువ మంది వారి షేర్లు కొనేందుకు మొగ్గు చూపుతారు." --- రాజ్ ఎన్, 'మేడ్ ఇన్ హైదరాబాద్' పుస్తక రచయిత