టెలికాం సంస్థల నుంచి కేంద్రప్రభుత్వం స్పెక్ట్రం రుసుము వసూలు చేయడాన్ని అనైతిక చర్యగా అభివర్ణించారు ఆ రంగ నిపుణులు టి.హనుమాన్ చౌదరి. ఈ ఏడాది చివర్లో లేదా 2020 ఆరంభంలో 5జీ స్పెక్ట్రం వేలం వేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్న వేళ ఈ వ్యాఖ్యలు చేశారు చౌదరి.
హనుమాన్ చౌదరి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ వీఎస్ఎన్ఎల్కు వ్యవస్థాపక ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. టెలికాం రంగం ప్రస్తుత స్థితిగతులపై హైదరాబాద్లో ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఏజీఆర్ వివాదంపై...
సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్) కేసులో ఇటీవల టెలికాం సంస్థలకు ప్రతికూలంగా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఈ ఆదేశాల ప్రకారం... భారతీ ఎయిర్టెల్ గ్రూప్ రూ.62,187.73 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.54,183.9 కోట్లు అపరాధ రుసుము 3 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే సవాళ్ల సవారీ చేస్తున్న టెలికాం సంస్థలకు ఈ తీర్పు శరాఘాతంగా మారింది.
ఏజీఆర్ వ్యవహారంలో కేంద్రం తీరును తప్పుబట్టారు హనుమాన్ చౌదరి. టీడీశాట్ టెలికాం సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా... సుప్రీంకోర్టులో కేంద్రం సవాలు చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఈ వైఖరితో ఆయా సంస్థలు మూతపడే ప్రమాదం తలెత్తిందని అభిప్రాయపడ్డారు.