తెలంగాణ

telangana

ETV Bharat / business

'బాయ్‌కాట్‌ చైనా' సరే.. మరి ఈ అంకురాలకు దిక్కెవరు? - boycott china products news

భారత్‌- చైనా సరిహద్దుల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో చైనా ఉత్పత్తుల నిషేధం దిశగా సామాజిక మాధ్యమాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. చైనాకు చెందిన, చైనా నిధులందే యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్‌ చేసే వారి సంఖ్యా పెరుగుతూ ఉంది. తాజా సంఘటనలు కాస్తా భారత అంకురాల్లోకి చైనా పెట్టుబడులు వచ్చే అవకాశాన్ని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరి ఈ సమయంలో ఆ అంకురాలు ఏం చేయాలి? అంతలా మన అంకురాలు చైనాపై ఆధారపడి ఉన్నాయా?

SPECIAL STORY ON STARTUPS
ఈ అంకురాలకు దిక్కెవరు

By

Published : Jun 26, 2020, 6:30 AM IST

భారత్‌లోని కొన్ని అంకురాలకు చైనా నుంచి వచ్చే పెట్టుబడులే ఆధారం. చైనాతో సంఘర్షణ వాతావరణానికి తోడు ఇటీవల భారత ప్రభుత్వం ఎఫ్‌డీఐ నిబంధనలను సవరించడం కూడా అంకురాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. సరిహద్దు దేశం నుంచి వచ్చే ఏ పెట్టుబడికైనా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో భారత్‌ మార్పులు చేసింది. ఇక తాజా సంఘర్షణ వాతావరణం నేపథ్యంలో పేటీఎమ్‌, ఓలా, బైజూస్‌...వంటి ఎన్నో పెద్ద అంకురాలపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. భారత్‌లోని ఈ టెక్‌ అంకురాలకు పెట్టుబడులు నిలిచిపోయే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.

ఇంతకీ ఎంత పెట్టుబడులు

భారత అంకురాలపై గత ఏడేళ్లుగా చైనా కంపెనీలు నమ్మకాన్ని కొనసాగిస్తున్నాయి. ఏకంగా 5.8 బి.డాలర్ల(దాదాపు రూ.42,000 కోట్లు) వరకు పెట్టుబడులు పెట్టాయి. ఒక్క గత ఏడాదిలోనే మొత్తం 47 ఒప్పందాలు కుదుర్చుకుని.. 1230 మి.డాలర్ల నిధులను మన అంకురాల్లో కుమ్మరించాయి. గేట్‌వే హౌస్‌ నివేదిక ప్రకారం.. దాదాపు సగం ప్రఖ్యాత అంకురాల(స్విగ్గీ, జొమోటో, పేటీఎమ్‌) బోర్డుల్లో చైనా పెట్టుబడుదార్లున్నాయి.

  • అత్యధికంగా స్నాప్‌డీల్‌లో అలీబాబా గ్రూప్‌, ఎఫ్‌ఐహెచ్‌ మొబైల్‌లు 700 మి. డాలర్ల వరకు అంచనా పెట్టుబడులు పెట్టాయి.
  • స్విగ్గీలోనూ టెన్సెంట్‌ హోల్డింగ్స్‌, మీతువాన్‌ డయాన్పింగ్‌, హిల్‌హౌస్‌ క్యాపిటల్‌, ఎస్‌ఏఐఎఫ్‌ పార్టనర్స్‌ వంటివి 500 మి. డాలర్లకు పైన పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
  • ఓలా, పేటీఎమ్‌, ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌బాస్కెట్‌, జొమోటో, హైక్‌, పేటీఎమ్‌ మాల్‌, డ్రీమ్‌ 11, ఉడాన్‌, ఓయో, బైజూస్‌, రివిగో వంటి అంకురాల్లో చైనా కంపెనీలు 25-500 మి. డాలర్ల వరకు పెట్టుబడులు ప్రవహింపజేశాయి.
  • 30 ప్రముఖ అంకురాల్లో 18 కంపెనీల్లో చైనా పెట్టుబడుదార్లే నిధులు పెట్టారు.
    భారత అంకురాలు

అదొక్కటే ఊరట..

అయితే చైనా కంపెనీలు నేరుగా భారత్‌లో పెట్టుబడులు పెట్టడం లేదు. వాటి అనుబంధ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెడుతున్నాయి. సింగపూర్‌, హాంకాంగ్‌, మారిషస్‌ వంటి దేశాల్లోని తమ అనుబంధ కంపెనీల ద్వారా భారత అంకురాల్లోకి నిధులను ప్రవహింపజేసే అవకాశం ఉంది. వాటిని చైనా పెట్టుబడులుగా పరిగణించరు కాబట్టి ఎఫ్‌డీఐ నిబంధనలు వర్తించవని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ అవకాశం అన్ని కంపెనీలకు ఉండాలి కదా.

మన అంకురాలపై ఎందుకు ఆకర్షణ

భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగదార్లు చాలా ఎక్కువ. వీరిని నమ్ముకునే టెక్‌ కంపెనీలపై చైనా కంపెనీలు మన అంకురాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. అదీకాక భారత్‌లో పెట్టుబడి కంపెనీలు తక్కువగా ఉండడం.. అంకురాలపై భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టే ధోరణి ఇంకా పెరగకపోవడంతో చైనా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. ముఖ్యంగా నష్టాల్లో ఉన్నా.. పెట్టుబడులు వస్తే కోలుకునే సత్తా ఉండే కంపెనీల్లో చైనా పెట్టుబడుదార్లు పాగా వేస్తున్నారు.

ఏప్రిల్‌ నుంచే కష్టాలు

ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం ఎఫ్‌డీఐ నిబంధనల్లో మార్పులు చేసింది. భారత్‌తో సరిహద్దును పంచుకునే (చైనా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, భూటాన్‌, మియన్మార్‌, ఆఫ్గనిస్థాన్‌) ఏ దేశం నుంచి వచ్చే ఎఫ్‌డీఐకైనా భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. ఇది చైనా పెట్టుబడులపై ఆధారపడ్డ భారత అంకురాలపై నేరుగా ప్రభావం చూపే నిబంధనే. అలీబాబా, టెన్సెంట్‌ వంటి దిగ్గజ చైనా పెట్టుబడి కంపెనీలపై ప్రభావం పడుతుంది.

ఇదీ చూడండి: ఫ్లెక్స్ పే... 10% ఛార్జీతో ఇండిగో టికెట్!

ABOUT THE AUTHOR

...view details