ఆర్థిక మాంద్యం వస్తుందని అందరూ భయపడుతున్నారు. వాహన, బిస్కెట్ రంగాల వారు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ... స్మార్ట్‌ఫోన్ తయారీదారులు మాత్రం దసరాకు ముందే దీపావళి జరుపుకున్నారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ పేరిట 6 రోజులు ప్రత్యేక అమ్మకాలతో అదరగొట్టారు.
స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఈ ఏడాది ఏకంగా 15 రెట్లు పెరిగాయి. సేల్స్‌లో సామ్సంగ్, వన్ ప్లస్, యాపిల్, షియోమి, వివో ఫోన్లు దూసుకెళ్లాయి.
"వన్ ప్లస్ ఫోన్లు రూ.700 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌తో పోల్చితే సామ్సంగ్ ఫోన్లు 5 రెట్లు ఎక్కువగా వినియోగదారుల చేతుల్లోకి చేరాయి. సామ్సంగ్ ఎం సిరీస్, ఎ, నోట్ 9 బాగా అమ్ముడయ్యాయి."
-అమెజాన్.ఇన్ ప్రకటన
షియోమి..
ఎంఐ టీవీలు సహా 53 లక్షల తమ ఉత్పత్తులు అమెజాన్‌లో అమ్ముడయ్యాయని తెలిపింది షియోమి. ఈ లెక్కన నిమిషానికి 525 ఫోన్లను వినియోగదారులు బుక్ చేసుకున్నారని ఆ సంస్థ ప్రకటించింది. రెడ్మీ నోట్ 7 సిరీస్ మొబైళ్లు 38 లక్షలు అమ్ముడయ్యాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
రియల్మీ
మరో చైనా మొబైల్ సంస్థ రియల్మీ 22 లక్షల స్మార్ట్ ఫోన్ హ్యాండ్సెట్లను విక్రయించింది. ఆఫర్ సమయంలో రూ. 300 కోట్ల తగ్గింపుతో మొబైళ్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచిందీ వ్యాపార సంస్థ. రియల్ మీ5, 3 ప్రో, సీ2 వంటి ఫోన్లు అతితక్కువ ధరలకు వినియోగదారులను చేరాయి.