పిల్లలను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులకు చాలా బీమా సంస్థలు ప్రత్యేక పాలసీలను అందుబాటులో ఉంచాయి. ఆ పాలసీలకు నామినీలుగా పిల్లలే ఉంటారు. వీటిలో పిల్లల ఆర్థిక రక్షణకు... సరైన బీమా పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. అవి పెరుగుతున్న ఖర్చులకు పాటు.. తల్లిదండ్రులకు అనుకోకుండా ఏమైనా జరిగితే పిల్లలకు ఆర్థిక రక్షణ ఇవ్వడం సహా వారి చదువులకు ఆటంకం కలగకుండా రక్షిస్తాయి.
చాలా పాలసీల వ్యవధి గరిష్ఠంగా పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేదాకా ఉంటాయి. ఆ తర్వాత కొన్ని సంస్థలు బీమా సొమ్మును వాయిదాల్లో వెనక్కి ఇస్తే.. మరికొన్ని ఏకకాలంలోనే ఇస్తాయి.
వీటితో పాటు మదుపు చేసే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఇవే....
ప్రీమియం వైవర్ బెనిఫిట్ ఉందా?
పిల్లల బీమా పాలసీల్లో ప్రీమియం 'వైవర్' బెనిఫిట్ అంతర్లీనంగా ఉంటుంది. బీమా చెల్లింపుదార్లకు ఏదైనా జరిగితే వారి తరఫున బీమా సంస్థలు ఆ ప్రీమియాన్ని చెల్లించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ అంశం మీరు ఎంచుకున్న పాలసీలో ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా వ్యవధి తీరేంతవరకూ ఏ ఇబ్బందీ లేకుండా పాలసీని కొనసాగించవచ్చు.
పూర్తిగా తెలుసుకున్నాకే పాలసీ
పెట్టుబడి పెట్టే ముందు వాటి పని తీరును క్షుణ్ణంగా పరిశీలించాలి. పిల్లలకు సంబంధించిన బీమా విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పాలసీకి సంబంధించిన ధ్రువపత్రాలన్నింటినీ పూర్తిగా చదవాలి. అర్థం కాని విషయాలను తెలుసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. ముఖ్యంగా బీమా కంపెనీ పని తీరు, సంస్థ క్లెయిమ్ రేట్ సహా అన్ని రకాలుగా పరిగణించి పాలసీ ఎంపిక చేసుకోవాలి. లేదంటే బీమా ఫలాలు అందే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
ఈక్విటీల్లో పెట్టుబడి
పాలసీ ఏదయినా మంచి రాబడిని అందించినప్పుడే ఎంచుకున్నందుకు ఫలితం ఉంటుంది. వీటితో పాటు సొమ్ముకూ భద్రత ఉండాలి. ఈక్విటీలు దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి పెట్టుబడులను ఈక్విటీలు, రుణాల్లోకి మళ్లించే విధంగా ఉండాలి. దీంతోపాటు తగిన మొత్తానికి బీమా రక్షణ కూడా ఉండాలి. వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ బీమా ఉండటం మంచిది. అప్పుడే వచ్చే మొత్తం కుటుంబ ఆర్థిక అవసరాలకు సరిపోతుంది.
ఇదీ చూడండి: ఈ పథకంతో పన్ను ఆదా, పింఛను భరోసా!