కరోనా సంక్షోభం నుంచి వాహన రంగం నెమ్మదిగా తేరుకుంటున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెల వాహన విక్రయ గణాంగాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
దేశంలోని పలు ప్రధాన వాహన తయారీ కంపెనీల సెప్టెంబర్ విక్రయాల లెక్కలు ఇలా ఉన్నాయి.
మారుతీ సుజుకీ..
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) విక్రయాలు సెప్టెంబర్‌లో (గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే) 30.8 శాతం పెరిగినట్లు ప్రకటించింది. గత నెల మొత్తం 1,60,442 యూనిట్లు విక్రయమైనట్లు వెల్లడించింది. 2019 సెప్టెంబర్‌లో ఎంఎస్ఐ 1,22,640 వాహనాలను విక్రయించింది.
సెప్టెంబర్‌లో దేశీయ విక్రయాలు 32.2 శాతం పెరిగి 1,52,608 యూనిట్లుగా నమోదైనట్లు ఎంఎస్ఐ వివరించింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1,15,452 యూనిట్లుగా ఉండటం గమనార్హం.
మారుతీ సుజుకీ ఎగుమతులు గత నెల 9 శాతం పెరిగి.. 7,834 యూనిట్లుగా నమోదయ్యాయి.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మారుతీ సుజుకీ 9,93,130 వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ అమ్మకాలు 16.2 శాతం అధికం.
ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంఎస్ఐ మొత్తం 4,69,729 వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇవి 36.6 శాతం తక్కువ.
టొయోటా కిర్లోస్కర్..
టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) దేశీయ విక్రయాలు సెప్టెంబర్‌లో 20.45 శాతం తగ్గినట్లు ప్రకటించింది. గత నెల 8,116 యూనిట్లు విక్రయించినట్లు వెల్లడించింది. 2019 సెప్టెంబర్‌లో టీకేఎం 10,203 వాహనాలు విక్రయించడం గమనార్హం.
ఆగస్టుతో పోలిస్తే మాత్రం టీకేఎం వాహన విక్రయాలు 46 శాతం పెరగటం గమనార్హం. ఆగస్టులో ఈ సంస్థ 5,555 యూనిట్లు మాత్రమే విక్రయించింది.
కరోనా తర్వాత డిమాండ్ పుంజుకుంటుందని టీకేఎం సేల్స్ విభాగ ఉపాధ్యక్షుడు నవీన్ సోనీ తెలిపారు. కరోనా సంక్షోభం తర్వాత ఇప్పటి వరకు సెప్టెంబర్‌లోనే అత్యుత్తమ అమ్మకాలు నమోదైనట్లు ఆయన చెప్పుకొచ్చారు.
బజాజ్ ఆటో
బజాజ్ ఆటో వాహన విక్రయాలు సెప్టెంబర్‌లో (2019 సెప్టెంబర్‌తో పోలిస్తే) 10 శాతం పెరిగి.. 4,41,306 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ సంస్థ 4,02,035 యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది.
బజాజ్ ఆటో మొత్తం విక్రయాల్లో 4,04,851 యూనిట్ల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 3,36,730 ద్విచక్ర వాహనాల విక్రయాలతో పోలిస్తే.. ఇది 20 శాతం ఎక్కువ.
వాణిజ్య వాహనాల విక్రయాలు మాత్రం గత నెల 44 శాతం తగ్గి.. 36,455 యూనిట్లకు పరిమితమైనట్లు బజాజ్ ఆటో వివరించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో 65,305 వాణిజ్య వాహనాలు విక్రయించినట్లు తెలిపింది.
బజాజ్ ఆటో సెప్టెంబర్‌లో దేశీయంగా 6 శాతం వృద్ధితో 2,28,731 యూనిట్లు విక్రయించింది. 14 శాతం వృద్ధితో 2,12,575 యూనిట్లు ఎగుమతి చేసింది.
ఎంజీ మోటార్స్..
మరో ప్రముఖ వాహన తయారీ సంస్థ.. ఎంజీ మోటార్స్ విక్రయాలు సెప్టెంబర్‌లో స్వల్పంగా 3 శాతం తగ్గాయి. గత నెల ఈ సంస్థ 2,537 యూనిట్లను విక్రయించింది. 2019 ఇదే సమయంలో సంస్థ విక్రయాలు 2,608 యూనిట్లుగా ఉండటం గమనార్హం. లాక్డౌన్ సమయంతో పోలిస్తే మాత్రం వాహన రంగానికి ప్రస్తుతం డిమాండ్ పెరిగినట్లు ఎంజీ మోటార్స్ వెల్లడించింది.
ఇదీ చూడండి:సెప్టెంబర్‌లో భారీగా పెరిగిన జీఎస్టీ రాబడులు