స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఇటీవల నమోదైన రికార్డు స్థాయి లాభాలను మదుపరులు సొమ్ముచేసుకునే పనిలో పడటం ఇందుకు ప్రధాన కారణం. వీటికి తోడు బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో నేటి నుంచి చోటుచేసుకున్న పలు మార్పులు ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలుస్తోంది.
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో.. టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, వేదాంత, ఎస్ బ్యాంక్ షేర్ల స్థానాల్లో అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లు ట్రేడవడం నేటి నుంచి ప్రారంభమైంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 39 పాయింట్ల క్షీణించింది.. చివరకు 41,643 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో 12,266 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,701 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,475 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,287 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,213 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.