ఆర్థిక వ్యవస్థ మందగమనంతో కొనుగోళ్లకు డిమాండ్ తగ్గడంపై నెలకొంటున్న ఆందోళనల నేపథ్యంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. అమ్మకందారులు, బ్రాండ్లలో ఊగిసలాట లేదని... రానున్న పండగల వేళ ఆఫర్లతో వరస కట్టడం ఖాయమని పేర్కొంది.
విజయదశమిని పురస్కరించుకుని సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు 'ఫెస్టివ్ సేల్'ను ఏర్పాటు చేయనుంది అమెజాన్. చిన్న పట్టణాల్లో అమెజాన్‌కు ఆదరణ ఎక్కువ ఉందని... దాదాపు 70 శాతం వినియోగదారులు తమ తలుపు తడతారని ఆశిస్తోంది.
"మా వద్ద 5 లక్షల మంది విక్రయదారులు ఉన్నారు. నూతనంగా మాతో కలిసే విక్రేతల రేటు ఎక్కువగానే ఉంది. 3,50,000గా ఉన్న అమ్మకందారుల సంఖ్య 12 నెలల్లోనే 5 లక్షలకు చేరుకుంది. అమెజాన్‌ను ఎంపిక చేసుకునే వారి సంఖ్యా పెరిగింది. మేం ఏ ఊగిసలాటను గమనించలేదు."
-మనీశ్ తివారీ, అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు
శామ్సంగ్, షియోమి, వన్ ప్లస్ వంటి ఫోన్ల ఉత్పత్తిదారులు.. బాష్ వంటి గృహోపకరణాల సంస్థలు.. టెలివిజన్ తయారీదారులు అమెజాన్లోనే వారి ఉత్పత్తులను విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు మనీశ్. ప్రైమ్ సభ్యత్వాలు కూడా పెరిగాయని తెలిపారు.
"మందగమనం ఉంటే అలా చేయరు. చేనేత కార్మికుల నుంచి పెద్ద విక్రేతల మనసుల్లో సందేహాలు కనిపించడం లేదు. వేగం, కొనగలిగే స్తోమత, ఎంపికతో ఈ దీపావళి మాకు చాలా పెద్దదిగా ఉంటుంది."