SEBI Norms: నమోదిత సంస్థ(లిస్టెడ్ కంపెనీ)ల ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ల పదవులను విభజించాలన్న నిబంధన తప్పనిసరి కాదని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటరీ సంస్థ సెబీ ప్రకటించింది. ఇది స్వచ్ఛందంగానే అమలు చేయనున్నట్లు తెలిపింది.
Separation of Chairperson, MD positions
సెబీ ఇదివరకు పేర్కొన్న నిబంధనల ప్రకారం 2022 ఏప్రిల్ నాటికి.. లిస్టెడ్ కంపెనీల ఛైర్పర్సన్, ఎండీలు చేపట్టే బాధ్యతలను విడదీయాల్సి ఉంది. అయితే, ప్రస్తుత సమయంలో ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని భావించడం లేదని సెబీ పేర్కొంది. ఈ మేరకు బోర్డు మీటింగ్ తర్వాత తాజా ప్రకటన జారీ చేసింది.
'తర్వాతి తరం సంస్కరణలు అవసరం'
మరోవైపు, సులభతర వాణిజ్యాన్ని మెరుగుపర్చేందుకు తర్వాతి తరం సంస్కరణలను చేపట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెబీకి సూచించారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాల వల్ల దేశీయ మార్కెట్లలో తలెత్తే అనిశ్చితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
బోర్డు మీటింగ్‌ను ఉద్దేశించి మాట్లాడిన నిర్మల.. ప్రస్తుతం సెబీ తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతించారు. మార్కెట్ మధ్యవర్తిత్వ వ్యయాలను తగ్గించడం, పెట్టుబడిదారులకు కల్పిస్తున్న రక్షణను బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సెబీకి సూచించారు. కార్పొరేట్ బాండ్ మార్కెట్, గ్రీన్ బాండ్ మార్కెట్లను మరింత అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:సాయంలో మస్క్ రికార్డ్- పిల్లల కోసం 570 కోట్ల డాలర్ల షేర్లు విరాళం!