తెలంగాణ

telangana

ETV Bharat / business

'రూ.62,600 కోట్లు కట్టాలి.. లేదంటే రాయ్​ అరెస్ట్'

సహారా గ్రూప్​ వెంటనే రూ.62,600 కోట్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మార్కెట్​ నియంత్రణ సంస్థ సెబీ సుప్రీంను ఆశ్రయించింది. ఒకవేళ డబ్బు జమచేయకపోతే సహారా సంస్థల అధినేత సుబ్రతా రాయ్​ను అరెస్ట్​ చేయాలని వ్యాజ్యంలో కోరింది.

Sebi
రూ.62,600 కోట్లు కట్టాలి లేకుంటే అరెస్ట్:సెబీ​

By

Published : Nov 20, 2020, 2:19 PM IST

సహారా గ్రూప్‌ సంస్థల అధినేత సుబ్రతా రాయ్‌ తక్షణమే రూ.62,600 కోట్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. డబ్బు జమ చేయని పక్షంలో ఆయన పెరోల్‌ను రద్దు చేయాలని కోరింది. 2012, 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సహారా గ్రూప్‌ పాటించలేదని సెబీ పిటిషన్‌లో పేర్కొంది.

ఓవైపు రోజురోజుకీ రుణాలు పెరుగుతుంటే వారు మాత్రం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ బయట ఆనందంగా తిరుగుతున్నారని సెబీ ఆరోపించింది. సహారా గ్రూప్‌ తక్షణమే బకాయిలు మొత్తం జమచేసేలా ఆదేశించాలని, లేదంటే వారిని తిరిగి జైలుకు పంపాలని న్యాయస్థానాన్ని కోరింది.

కేసు ఇదే...

సెబీకి అవసరమైన పత్రాలు ఇవ్వకుండా సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 3.07 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి వరుసగా రూ.19,400.87 కోట్లు, రూ. 6,380.50కోట్లను సేకరించాయి. ఈ వ్యవహారం కాస్తా సుప్రీంకోర్టుకు చేరడం వల్ల నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇన్వెస్టర్లకు చెల్లించాలంటూ 2012లో సర్వోన్నత న్యాయస్థానం సహారా గ్రూప్‌ను ఆదేశించింది. ఎనిమిదేళ్ల క్రితం ఆ మొత్తం రూ. 25వేల కోట్లు కాగా.. ఇప్పుడది రూ.62,600 కోట్లకు పెరిగింది.

అయినప్పటికీ సహారా గ్రూప్‌ డబ్బు చెల్లించకపోవడం వల్ల ఆ సంస్థల అధినేత సుబ్రతా రాయ్‌, మరికొందరిని కస్టడీలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలా రెండేళ్ల పాటు దిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న సుబ్రతా రాయ్‌, మరో ఇద్దరు డైరెక్టర్లు 2016లో బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి వారు బయటే ఉన్నారు. 2020 ఫిబ్రవరి నాటికి సహారా గ్రూప్‌ రూ.15,448 కోట్లు జమ చేసింది. ఆ తర్వాత ఎలాంటి చెల్లింపులు జరపకపోవడం వల్ల సెబీ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఖండించిన సహారా...

సెబీ డిమాండ్‌ పూర్తిగా అర్థరహితమని, ఉద్దేశపూర్వకంగానే 15 శాతం వడ్డీ కలిపిందని సహారా ఆరోపించింది. ఇన్వెస్టర్లకు ఇవ్వాల్సిన మొత్తాన్ని సంస్థ తిరిగిచ్చేసిందని సహారా గ్రూప్‌ ఈ-మెయిల్‌ ద్వారా కోర్టుకు వెల్లడించినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details