రెండు దశాబ్దాల క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ టేకోవర్ నిబంధనలు పాటించని కేసులో సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించడంపై కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్)లో అప్పీలు చేసుకున్నారు. 1994లో కన్వర్టబుల్ వారెంట్లతో డిబెంచర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ జారీ చేసింది. 2000 సంవత్సరంలో వారెంట్లకు ఈక్వీటీ షేర్లను కేటాయించింది. అవిభజిత రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ధీరూభాయ్ అంబానీ నడిపించిన సమయంలో ఇది జరిగింది.
అంబానీ కుటుంబంపై..
టేకోవర్ నిబంధనల ఉల్లంఘనపై 2011లో ఫిబ్రవరిలో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌నకు సెబీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తాజగా ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, మరికొందరు వ్యక్తులు, సంస్థలపై సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించింది. ఈ జాబితాలో ముకేశ్ భార్య నీతా; అనిల్ భార్య టీనాలూ ఉన్నారు. సెబీ టేకోవర్ నిబంధనలను ఉల్లంఘించలేదని, శాట్‌లో వాదన వినిపిస్తామని ఎక్సేంజీలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సమాచారమిచ్చింది.