ప్రముఖ ఔషధ తయారీ సంస్థ రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ మోహన్‌సింగ్, శివీందర్ సింగ్‌లకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఫోర్టింగ్ గ్రూప్‌లోని తమ నియంత్రణ వాటాను మలేషియా సంస్థకు సింగ్ సోదరులు అమ్మడం వల్ల.. తమ మధ్యవర్తిత్వ రుసుము 3 వేల 500 కోట్ల రూపాయలు ప్రమాదంలో పడ్డాయని... జపాన్ సంస్థ గతంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం.. వీరు కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు పేర్కొంది.
ఒక్కొక్కరూ రూ.1175 కోట్లు జమ చేయాలి
ఫోర్టిస్ గ్రూపులో తమ నియంత్రణ వాటాను.. మలేషియా సంస్థ ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు అమ్మడం ద్వారా.. తాము ఇంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను వీరు ఉల్లంఘించారని ధర్మాసనం స్పష్టం చేసింది. సింగ్ సోదరులు తమ ఆదేశాన్ని ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం తీర్పులో పేర్కొంది. ఇందుకు సోదరులిద్దరూ ఒక్కొక్కరు 1175 కోట్ల రూపాయలు జమ చేయాలని ఆదేశించింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ఆఫర్‌పై స్టే ఎత్తేయడానికి నిరాకరించింది. ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా సుమోటో ధిక్కారాన్ని ప్రారంభించిన సుప్రీం.. తదుపరి విచారణలో ఓపెన్ ఆఫర్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. వీరిద్దరికి త్వరలో శిక్షను నిర్ధరిస్తామని తీర్పు చెప్పింది.
ఇదీ చూడండి : క్రికెట్లోకి సచిన్ ఆగమనం, నిష్క్రమణ ఒక్కటైన వేళ