స్థిరాస్తి వ్యాపార సంస్థ అమ్రపాలి కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆమ్రపాలి రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. వీటితోపాటు నోయిడా, గ్రేటర్ నోయిడాలకు ఇచ్చిన లీజులను కూడా రద్దు చేసింది అత్యున్నత న్యాయస్థానం.
అమ్రపాలి గ్రూపు నుంచి ఆగిపోయిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్‌ను నియమించింది జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ లలిత్‌తో కూడిన ధర్మాసనం.
కోర్టు రిసీవర్‌గా సీనియర్ న్యాయవాది
ఆమ్రపాలి లీజు రద్దు తర్వాత ఆస్తులు ఎవరికి దక్కాలి అనే అంశంపై కోర్టు రిసీవర్‌గా సీనియర్ న్యాయవాది ఆర్. వెంకటరమణిని నియమించింది అత్యున్నత న్యాయస్థానం. బకాయిలను రాబట్టేందుకు గ్రూపు ఆస్తులను విక్రయించడం, ఏదైనా థర్ట్ పార్టీతో ఒప్పందం చేసుకునే అధికారం వెంకటరమణికి ఉంటుందని స్పష్టం చేసింది.
విదేశీ మారకం నిర్వహణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు ఉల్లంఘించి గృహ కొనుగోలుదారుల డబ్బును దారి మళ్లించినట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందుకు నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులు సహకరించినట్లు పేర్కొంది.