ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) గృహ రుణాలపై వడ్డీ రాయితీ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్ నేపథ్యంలో గృహ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు రాయితీ ఇవ్వనున్నట్లు బుధవారం వెల్లడించింది.
ఎస్బీఐ వడ్డీ రాయితీ వివరాలు..
రూ.75 లక్షలకుపైగా గృహరుణం తీసుకున్న వారికి 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ లభిస్తుంది. అయితే రుణగ్రహీత సిబిల్ స్కోరు ఆధారంగా, యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ప్రస్తుతం రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు గృహ రుణాలపై.. క్రెడిట్ స్కోరు ఆధారంగా 10 బేసిస్ పాయింట్ల వరకు ఇస్తున్న వడ్డీ రాయితీని పండుగ సీజన్ నేపథ్యంలో 20 బేసిస్ పాయింట్లకు పెంచింది ఎస్బీఐ.
తాజా ఆఫర్‌తో.. రూ.3 కోట్ల వరకు గృహ రుణంపై ఇదే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. 8 మెట్రో నగరాల్లో ఈ సదుపాయం వినియోగించుకునే వీలుంది. యోనో యాప్ ద్వారా గృహ రుణానికి దరఖాస్తు చేసే వారికి 5 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రాయితీ లభిస్తుంది.
ఎస్బీఐ ప్రస్తుతం రూ.30 లక్షల వరకు గృహ రుణాలకు 6.90 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. రూ.30 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకుంటే 7 శాతం వడ్డీ విధిస్తోంది.
ఇదీ చూడండి:జర్మనీ జీడీపీని దాటిన చైనా కుబేరుల సంపద