దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్.. ఈ ఏడాది కూడా ప్రపంచ టీవీ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచే అవకాశముందని ఓ నివేదిక అంచనా వేసింది. అదే జరిగితే శాంసంగ్ వరల్డ్ టీవీ మార్కెట్ లీడర్ స్థానాన్ని దక్కించుకోవడం వరుసగా ఇది 15వ సారి అవుతుంది.
మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఓమ్డియా ప్రకారం శాంసంగ్ ఈ ఏడాది మొత్తం 4.9 కోట్ల టీవీలు విక్రయించే వీలుంది. ఇప్పటికే మొదటి మూడు త్రైమాసికాల్లో 3.39 కోట్ల యూనిట్లకుపైగా విక్రయించింది శాసంగ్.
కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ఇంట్లోనే ఉండటం వల్ల టీవీలకు డిమాండ్ పెరిగినట్లు నివేదిక అభిప్రాయపడింది.
గత ఏడాదితో పోలిస్తే శాంసంగ్ టీవీల విక్రయాలు 11.2 శాతం పెరిగే వీలుంది. 2014 తర్వాత ఈ స్థాయిలో విక్రయాలు నమోదవ్వడం కూడా ఇదే ప్రథమం కానుందని ఓమ్డియా వివరించింది. సోచీ వింటర్ ఒలంపిక్స్, బ్రెజిల్ వరల్డ్ కప్ కారణంగా 2014లో అత్యధికంగా 5.29 కోట్ల టీవీలను విక్రయించ గలిగింది శాంసంగ్.