దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ మరో కొత్త రకం స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నట్లు ఇటీవల ప్రకటించింది. అడ్డంగా మడతబెట్టే ఫోన్లను ఇప్పటికే మార్కెట్లోకి తెచ్చిన శాంసంగ్.. ఇప్పుడు నిలువుగా మడతబెట్టే ఫోన్లను ఆవిష్కరించేందుకు కృషి చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ డెవలపర్ల సదస్సులో శాంసంగ్ వెల్లడించింది.
మడత ఫోన్ల రారాజుగా..
గతంలో మడతఫోన్లు తీసుకురానున్నట్లు చాలా కంపెనీలు ప్రకటించాయి. వీటిలో ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజాలు హువావే, ఒప్పో, వీవో ఉన్నాయి. అయితే ఈ సంస్థలు వాటి మడత ఫోన్లకు ఇంకా మెరుగులు దిద్దుతూ... మార్కెట్లోకి ఆ మోడళ్లను విడుదల చేయలేదు. అదే సమయంలో మడత ఫోన్ల ప్రకటన చేసిన శాంసంగ్.. గెలాక్సీ ఫోల్డ్ పేరుతో మార్కెట్లోకి ఆ మోడల్‌ను విడుదల చేసింది. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను విక్రయించిన తొలి సంస్థగా మార్కెట్లో పేరు సంపాదించింది.