మొబైల్ ప్రేమికులను ఊరిస్తున్న గెలాక్సీ ఫోల్డబుల్ (మడత) ఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్. సెప్టెంబర్ నుంచి ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాంసంగ్ తెలిపింది.
మొదట ఏప్రిల్ 26నే మార్కెట్లోకి ఈ ఫోన్‌ను విడుదల చేయాలని శాంసంగ్ భావించింది. అయితే టెస్టింగ్ దశలో డిస్ప్లేపై భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ కారణంగా విడుదలను వాయిదా వేసింది.
ప్రస్తుతం ఈ మోడల్‌కు తుది మెరుగులు దిద్దుతోంది శాంసంగ్. ముఖ్యంగా 'ఇన్ఫినిటీ డిస్ప్లే' విషయంలో కీలక మార్పులు చేసినట్లు శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఫోన్ మడతపెట్టడంలో సహకరించే కీలు భాగాలకు ఇరువైపులా (పైనా, కింద) అదనపు రక్షణ కవచాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. యూజర్లకు ప్రత్యేక ఫోల్డబుల్ అనుభూతిని ఇచ్చేందుకు మార్పులు చేసినట్లు పేర్కొంది.