2019 రెండో త్రైమాసింకంలో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ప్రపంచ వ్యాప్తంగా 75 మిలియన్ల స్మార్ట్ఫోన్లు విక్రయించింది. 2018 రెండో త్రైమాసికంతో పోలిస్తే ఇది 1.1 శాతం ఎక్కువ. వరుసగా ఆరు త్రైమాసికాల్లో అమ్మకాల క్షీణత తర్వాత.. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పుంజుకున్నట్లు ప్రముఖ టెక్ రీసర్చ్ సంస్థ గార్ట్నర్ పేర్కొంది. 'గెలాక్సీ ఏ' సీరిస్ మొబైల్ఫోన్లకు దక్కిన ఆదరణ, మిడ్ రేంజ్ ఫోన్లపై దృష్టి సారించడం కారణంగా శాంసంగ్‌కు అమ్మకాలు పెరిగినట్లు వెల్లడించింది.
శాంసంగ్ అమ్మకాల్లో వృద్ధి సాధించినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు మాత్రం 1.7 శాతం క్షీణించాయి. 2019 జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి ప్రపంచ వ్యాప్తంగా 368 మిలియన్ యూనిట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయినట్లు గార్ట్నర్ నివేదిక తెలిపింది. మిడ్ రేంజ్ ఫోన్లతో పోలిస్తే.. హై-ఎండ్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు భారీగా క్షీణించినట్లు పేర్కొంది.
"అమ్మకాలు పెంచుకునేందుకు స్మార్ట్‌ఫోన్ సంస్థలు సరికొత్త వ్యూహాలను అనుసరించాయి. ఎక్కువ కెమెరాలు, నాచ్ లేని డిస్ప్లే, బ్యాటరీ సామర్థ్యం పెంచడం వంటి ప్రీమియం ఫీచర్లను తీసుకువచ్చాయి. ఆయా సంస్థలకు చెందిన హైరేంజ్ ఫోన్లు మొదలుకుని బడ్జెట్ ఫోన్ల వరకు ఈ సదుపాయాలను తీసుకువచ్చాయి." -అన్షుల్ గుప్తా, సీనియర్ పరిశోధకుడు
ధరలు తగ్గించినా పెరగని ఐఫోన్ విక్రయాలు
ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే.. రెండో త్రైమాసికంలో ఐ ఫోన్లపై ధరలు తగ్గించినప్పటికీ అమ్మకాలు క్షీణించాయి. 2019 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా 38 మిలియన్ యూనిట్లు మాత్రమే అమ్మింది యాపిల్.