ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్‌ల విడుదలలో దూకుడుగా వ్యవహరిస్తోంది. రానున్న 5 నుంచి 7 ఏళ్లలో కనీసం మూడు నెలలకోసారి ఒక కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. కనీసం 28 మోడళ్లను ఈ సమయంలో ఆవిష్కరించాలని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఈ బైక్‌లన్నీ మిడ్ రేంజ్ సెగ్మెంట్ అయిన 250 సీసీ నుంచి 750 సీసీ ఇంజిన్లతో వస్తాయని రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓ వినోద్ దాసరి తెలిపారు.
పెట్టుబడుల్లో ఎక్కువ భాగం వాటికే..
ఈ ప్రణాళికోసం ఎంత పెట్టుబడులు పెట్టనున్నారనే విషయాన్ని మాత్రం వినోద్ చెప్పలేదు. ఎలక్ట్రిక్, డిజిటల్ సొల్యూషన్స్ వంటి సాంకేతికతలతో ఈ కొత్త బైక్‌లను తీసుకురానున్నట్లు మాత్రం స్పష్టం చేశారు. రానున్న 2-3 ఏళ్ల వరకు వచ్చే డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి సామర్థ్యం తమకు ఉన్నందున.. పెట్టుబడుల్లో ఎక్కువ భాగం కొత్త టెక్నాలజీలు, వ్యాపార విస్తరణల కోసం కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
విస్తరణ..
అంతర్జాతీయ మార్కెట్లో కొన్నాళ్లుగా తాము ఆసాధారణ వృద్ధిని నమోదు చేస్తున్నట్లు తెలిపింది రాయల్ ఎన్ఫీల్డ్. గత ఏడాది కాలంగా బ్రిటన్‌లో 'ఇంటర్సెప్టార్' ఎక్కువగా అమ్ముడుపోయిన మోడల్‌గా నిలిచినట్లు వెల్లడించింది. ప్రపంచ మార్కెట్లో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అర్జెంటీనాలో ఇటీవలే అసెంబ్లీ యూనిట్‌ను నెలకొల్పినట్లు పేర్కొంది. రానున్న 6-12 నెలల్లో థాయ్‌లాండ్, బ్రెజిల్‌లోనూ అసెంబ్లీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి:దీపావళి కానుకగా మహీంద్ర సరికొత్త 'థార్'