ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రోడ్ల నిర్మాణానికి ఓ సరికొత్త ప్రతిపాదనను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ముందు ఉంచింది. పునర్వినియోగానికి వీలుకాని ప్లాస్టిక్‌ను రోడ్ల నిర్మాణంలో వినియోగించే సాంకేతికతను అందించేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది.
పైలట్ ప్రాజెక్ట్‌లో సత్ఫలితాలు..
ఈ కంపెనీ ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లా నాగోతానేలో దాదాపు 40 కిలో మీటర్ల మేర రోడ్డును నిర్మించింది. తార్‌లో కలిపిన 50 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల మిశ్రమాన్ని ఇందుకు వినియోగించింది.
"ప్లాస్టిక్ వ్యర్థాలైన స్నాక్స్, ప్యాకేజింగ్ కవర్లు సహా ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్డు నిర్మాణంలో వాడే విధానాన్ని అభివృద్ధి చేసేందుకు మాకు 14 నుంచి 18 నెలల సమయం పట్టింది. రోడ్డు నిర్మాణాల్లో ప్లాస్టిక్ వినియోగించడంలో సహాయం చేసేందుకు మా అనుభవాన్ని ఎన్హెచ్ఏఐతో పంచుకుంటున్నాం."
- విపుల్ షా, రిలయన్స్ పెట్రోకెమికల్ వ్యాపారాల సీఓఓ