తెలంగాణ

telangana

ETV Bharat / business

సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌లోకి రిలయన్స్ - రిలయన్స్

ఫ్యూచర్ బ్రాండ్ సూచీలో రెండో స్థానం దక్కించుకున్న రిలయన్స్ తాజాగా సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టిసారించింది. దీన్ని దీర్ఘకాలిక అవకాశంగా గుర్తించిన రిలయన్స్‌.. ఈ విభాగంలోకి అడుగుపెట్టి, పెద్ద ఎత్తున విస్తరించాలని యోచిస్తోంది. 2035 కల్లా ప్రపంచంలో అతి పెద్ద కంపెనీగా అవతరించాలని ప్రణాళికలు రచిస్తోంది.

Reliance to replace auto fuels with electricity, hydrogen as Reliance focuses on non-conventional energy sources
సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌లోకి రిలయన్స్

By

Published : Aug 6, 2020, 6:44 AM IST

పెట్రో రసాయనాలతో మొదలు పెట్టి.. రిటైల్‌.. టెలి కమ్యూనికేషన్ల రంగాల్లోకి శర వేగంగా విస్తరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించింది. ఇటీవల కాలంలో సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి.

థర్మల్‌ విద్యుదుత్పత్తిలో కాలుష్యం అధికంగా వెలువడుతున్నందున, క్రమేణా ఈ విభాగం నుంచి తప్పుకోవాలని మన దేశంతో సహా.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ ఆలోచిస్తున్నాయి. భవిష్యత్తులో సంప్రదాయేతర విద్యుత్‌ మీదే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని దీర్ఘకాలిక అవకాశంగా గుర్తించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ విభాగంలోకి అడుగుపెట్టి, పెద్ద ఎత్తున విస్తరించాలని, 15 ఏళ్లలో అగ్రగామిగా ఎదగాలనీ యోచిస్తోంది.

'ఇది 15 ఏళ్ల దీర్ఘకాలిక వ్యూహంతో వేస్తున్న అడుగులు.. ఇందులో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు, సాంకేతిక భాగస్వాములు, ఈ రంగంలో పనిచేస్తున్న అంకురాలతోనూ కలిసి పనిచేస్తాం'

- వార్షిక సమావేశంలో ముకేశ్‌ అంబానీ

ప్రస్తుతం దేశీయ విద్యుత్‌ ఉత్పత్తిలో థర్మల్‌ వాటా 64 శాతం వరకూ ఉంది. సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 22 శాతం, జల విద్యుత్‌ 13 శాతం వరకూ ఉండగా.. ఒకశాతం అణు విద్యుత్‌ ఉంది. రాబోయే 10 ఏళ్ల కాలంలో సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని కనీసం 40 శాతానికి చేర్చాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సౌర, పవన విద్యుత్‌ రంగాలకు ప్రోత్సాహాన్నిస్తోంది. ప్రస్తుతం ఉన్న కాలుష్య ఉద్గారాలను 2030 నాటికి కనీసం 33-35 శాతం వరకు తగ్గించి, 2005 స్థాయులకు తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

వ్యూహాత్మకంగా అడుగులు

ఈ నేపథ్యంలో సౌర, పవన, హైడ్రోజన్‌, ఫ్యూయల్‌ సెల్‌, బ్యాటరీలాంటి సంప్రదాయేతర విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రయతిస్తోంది. చమురు, రసాయనాలతోనే సరిపెట్టకుండా.. దీర్ఘకాలిక వ్యూహంతో సంస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనికోసం సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌ రంగంలోకి ప్రవేశించి.. 2035 కల్లా ప్రపంచ స్థాయిలో నిలపాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో సొంతంగా ముందుకెళ్లడంతో పాటు, ఇతర సంస్థలను విలీనం చేసుకోవడం ద్వారానూ విస్తరించేందుకు యోచిస్తోంది.

ప్రత్యామ్నాయాలు

సంప్రదాయేతర ఇంధన వనరులతో విద్యుత్‌ ఉత్పత్తితోపాటు, వాహనాల ఇంధనానికీ ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్‌, విద్యుత్‌లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇదేకాకుండా.. పెట్రోకెమికల్స్‌ తయారీలో వెలువడే కార్బన్‌డైయాక్సైడ్‌ను సేకరించి, దాంతో ఇతర రసాయనాలు, బిల్డింగ్‌ మెటీరియల్‌ బ్లాకులుగా మార్చేందుకూ రిలయన్స్‌ ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా 2035 నాటికి సున్నా కర్బన ఉద్గారాలను విడుదల చేసే కంపెనీగా గుర్తింపు పొందాలన్నదీ రిలయన్స్‌ లక్ష్యం.

For All Latest Updates

TAGGED:

Reliance

ABOUT THE AUTHOR

...view details